మెదడులో కణితులు!

ABN , First Publish Date - 2021-05-04T18:07:56+05:30 IST

మెదడుకు సంబంధించి వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్‌ గడ్డలు, కేన్సర్‌ కాని గడ్డలు, వ్యాస్క్యులర్‌లో తేడాలు మొదలైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే మెదడులో ఏ రకమైన కణితి ఉన్నా ప్రమాదమే!

మెదడులో కణితులు!

ఆంధ్రజ్యోతి(04-05-2021)

మెదడుకు సంబంధించి వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్‌ గడ్డలు, కేన్సర్‌ కాని గడ్డలు, వ్యాస్క్యులర్‌లో తేడాలు మొదలైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే  మెదడులో ఏ రకమైన కణితి ఉన్నా ప్రమాదమే! 


కణితి ప్రదేశం, పరిమాణాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఈ కేన్సర్‌ గడ్డ మెదడు కణజాలంలో ఏర్పడినా, లేదా ఇతర శరీర భాగాల్లోని కేన్సర్‌ మెదడుకు ప్రసరించినా లక్షణాలు ఒకేలా ఉంటాయి. తలనొప్పి, వికారం, ఒక్కోసారి వికారం లేకుండానే వాంతులు, ప్రవర్తనలో మార్పులు, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, వాసన పసిగట్టలేకపోవడం, వినికిడి శక్తి కోల్పోవడం, రెండుగా కనిపించడం, మూర్ఛ, విపరీతమైన చీకాకు, నీరసం, వణుకు, అతి నిద్ర ఇలా అనేక రకాల లక్షణాలు కనిపించవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్లలో తలనొప్పి లేక మైగ్రేన్‌ లక్షణాలు కనిపించినా, పిల్లలు తరచూ తలనొప్పి అని బాధపడుతున్నా తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. చాలా సందర్భాల్లో ఈ తలనొప్పి తల పైభాగంలో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. తలనొప్పితో పాటు మెదడు చుట్టూ ఉండే ద్రవం సెరిబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌ ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తే అనుమానించాల్సిందే! స్కానింగ్‌లో మెదడులోని గడ్డలు బయటపడుతూ ఉంటాయి. 


అన్ని కేన్సర్‌లలాగానే మెదడు కేన్సర్‌కూ కచ్చితమైన కారణాలు తెలియవు. వినైల్‌ క్లోరైడ్‌కు ఎక్కువగా గురైనా, అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రభావం, పుట్టుకతో లోపాలు ఈ కేన్సర్‌కు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. మెదడులో వచ్చే కణితులు, ఇతర శరీర భాగాల నుంచి మెదడుకు వ్యాపించిన కణితులతో పాటు గ్లకోమా, మెనింజియోమాస్‌, పిట్యూటరీ అడినోమా, నర్వేషీత్‌ ట్యూమర్‌ అనే నాలుగు రకాలుగా ఈ కణితులు బయల్పడుతూ ఉంటాయి. వీటిలో గ్లకోమా కణుతులు 50శాతం వస్తుంటాయి. కణితి ప్రదేశాన్ని బట్టి రకాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. మెదడులో బినైన్‌ ట్యూమర్‌ పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. 


పరీక్షలు!

ఎక్స్‌రే, సిటి స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌, రక్తంలోకి డై పంపించి చేసే పరీక్షలు, సిటి, ఎమ్మారై స్కాన్‌ల సహాయంతో చిన్న రంధ్రం ద్వారా మెదడులోని కణాలను బయాప్పీ పరీక్ష చేయడం, ఇలా కుదరనప్పుడు క్రేనియాటమీ ద్వారా శాంపిల్‌ను సేకరించి, పరీక్షించి, కేన్సర్‌ దశ, గ్రేడ్‌ నిర్ణయిస్తారు. క్రేనియాటమీ కుదరనప్పుడు రేడియోథెరపీ, దీన్లో భాగంగా ఎక్స్‌రే, గామా రే, లేదా ప్రోటాన్‌లను ఉపయోగిస్తారు. కణితి పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోథెరపీ, గడ్డ సైజు తగ్గిన తర్వాత సర్జరీ చేస్తారు. సాధారణంగా పెద్దవారికి సర్జరీ లేదా రేడియేషన్‌ తర్వాత కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకు కీమోథెరపీతో పరిష్కారం దక్కవచ్చు. చిన్నపిల్లల్లో కేన్సర్లు మందులకు లొంగుతాయి. కాబట్టి తలనొప్పులను నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలతో కేన్సర్‌ కాదని నిర్థారించుకోవాలి. 


-డాక్టర్‌ సిహెచ్‌. మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421


Updated Date - 2021-05-04T18:07:56+05:30 IST