‘తుంపర’ మాటలు...

ABN , First Publish Date - 2021-06-20T05:39:27+05:30 IST

పథకాన్ని పూర్తిగా రద్దుచేయడం లేదంటే నిబంధనల కొర్రీలతో లబ్ధిదారుల జాబితాను సగానికి సగం కుదించడం... మరి కొన్నింటి విషయంలో రేపోమాపో అమలుచేస్తామంటూ కాలం వెల్లబుచ్చడం ఇదీ జిల్లాలో రైతన్న సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న తీరు. రైతు సంక్షేమం కోసం అమలవుతున్న ఆ బృహత్‌ పథకాన్ని ప్రస్తుత సర్కారు అటకెక్కించింది. రైతులు కూడా ఏంచేయాలో తెలియక సూక్ష్మసాయం కోసం ఎదురుచూస్తూ కాలం వెల్లదీశారు.

‘తుంపర’ మాటలు...
సూక్ష సేద్యం కింద సాగులో ఉన్న వేరుశనగ

సూక్ష్మ సేద్యాన్ని  పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం

గతేడాది పేర్లు నమోదుచేసుకున్న వేలమంది రైతులు

వారికే ఇంతవరకు అతీగతీ లేదు

బిందు, తుంపరసేద్యం విషయంలో తాజాగా ప్రభుత్వ ప్రకటన 

పదివేల హెక్టార్లలో అమలంటూ ఆర్భాటం

రాయితీ విషయంలో కూడా కోతలు

ఒంగోలు(జడ్పీ), జూన్‌ 19:  

రైతులకు సూక్ష్మ సాయం అందని ద్రాక్షాలానే మారింది. సర్కారు వారి వరస ‘కన్నతల్లికి బువ్వ పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానన్నాడంట’ అన్న చందంగా ఉంది. సంవత్సరం నుంచి జిల్లాలో సూక్ష్మసేద్యం రాయితీల కోసం ఎదురుచూస్తున్న వారికి మోక్షం లేదు గాని మళ్లీ కొత్తగా 10వేల హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు జరిపి రైతులకు మేలు చేస్తామనే ఆర్భాటపు మాటలు చెబుతున్నారు. ఇదంతా ఎవరిని వంచించడానికని జిల్లా రైతాంగం ప్రశ్నిస్తోంది. గత ఏడాది సూక్ష్మసేద్యం కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వేలమంది రైతులకు ఇప్పటివరకు రాయితీ మంజూరు చేయలేదు సరికదా...దాదాపు వారి సంగతే ప్రభుత్వం మరిచిపోయింది. ఇప్పుడేమో తుంపర ప్రకటనలతో హడావుడి చేస్తున్నారు. కాగా తాజాగా ప్రభుత్వ ప్రకటించిన రాయితీల్లోనూ కోతలు పెట్టారు. గతంలో పది ఎకరాల వరకు రాయితీ 90శాతం ఇవ్వగా దానిని 70శాతంకు కుదించారు.

పథకాన్ని పూర్తిగా రద్దుచేయడం లేదంటే నిబంధనల కొర్రీలతో లబ్ధిదారుల జాబితాను సగానికి సగం కుదించడం... మరి కొన్నింటి విషయంలో రేపోమాపో అమలుచేస్తామంటూ కాలం వెల్లబుచ్చడం ఇదీ జిల్లాలో రైతన్న సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న తీరు. రైతు సంక్షేమం కోసం అమలవుతున్న ఆ బృహత్‌ పథకాన్ని ప్రస్తుత సర్కారు అటకెక్కించింది. రైతులు కూడా ఏంచేయాలో తెలియక సూక్ష్మసాయం కోసం ఎదురుచూస్తూ కాలం వెల్లదీశారు. అయితే రెండు సంవత్సరాల నుంచి గాలికొదిలేసిన సూక్ష్మ సేద్య పథకాన్ని గొప్పగా అమలుచేస్తామని కొంచెం తీరు మార్చి తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యం(బిందు, తుంపర) కోసం ఈ ఏడాది రాయితీలు వర్తింపజేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఈ లక్షన్నర హెక్టార్లలో జిల్లా వాటా 10వేల హెక్టార్లపైనే ఉండే అవకాశముంది. దీనిని స్వాగతించవలసిందే. కానీ గతేడాది సూక్ష్మసేద్యం కోసం జిల్లాలో  దరఖాస్తు చేసుకున్న 2,040 మంది రైతులకు ఇప్పటివరకు రాయితీ మంజూరు కాలేదు. కనీసం వారి దరఖాస్తులను పరిశీలించిన దాఖలాలు లేవు. కార్యాలయాల చుట్టూ తిరిగినా సమాధానం చెప్పేవారే లేకపోవడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. 


సూక్ష్మ సేద్యం అంటే...

నానాటికీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను వృథా కాకుండా కాపాడుకోవడమే సూక్ష్మ సేద్యం ప్రధాన ఉద్దేశం. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని అతి తక్కువ నీటితో మెరుగైన ఫలితాలు రాబట్టడమే ఈ సేద్యం అభిమతం. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనికి అంకురార్పణ చేసింది. అప్పట్లో సాగునీటిని పొదుపుగా వాడుకోవడంపై రైతులకు పెద్దఎత్తున జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వం కూడా ఈ విధానంలో ఉన్న సానుకూలతలను గుర్తించి పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతో పాటు రాయితీలను కూడా సకాలంలో అందించి రైతులకు మేలు చేకూర్చింది. కొత్త ప్రభుత్వంలోనే ఆ పథకం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కానీ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆ పథకంపై మళ్లీ రైతన్నలకు ఆశలు చిగురిస్తున్నాయి. కానీ ఇప్పటికే ప్రక్రియలో ఉన్న దరఖాస్తులకు మోక్షం కల్పించకుండా మళ్లీ ప్రకటనలు చేయడంతో పలు సందేహాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి.

రాయితీకి కూడా కోతలు...

గత ప్రభుత్వం ఐదెకరాలలోపు పొలం ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 90శాతం రాయితీ వర్తింపుజేసింది. 90 శాతం రాయితీ పరిమితిని గరిష్ఠంగా నాలుగు హెక్టార్లకు పరిమితం చేసింది. ప్రభుత్వం తాజగా విడుదల చేసిన ప్రకటనలో రెండు హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతుకు 90శాతం రాయితీ అని, నాలుగు హెక్టార్ల వరకు 70శాతం రాయితీ అందిస్తామని తెలిపింది. గత ప్రభుత్వం నాలుగు హెక్టార్ల వరకు 90శాతం రాయితీని అందిస్తే ప్రస్తుతం అది రెండు హెక్టార్లకే ప్రస్తుత ప్రభుత్వం పరిమితం చేసింది. రెండేళ్లుగా అసలు పథకాన్ని అమలు చేయకపోవడం అటుంచి తాజాగా సబ్సిడీలో కోతలు పెడుతూ ప్రకటన చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గతేడాది పేర్లు నమోదు చేసుకున్న 2,040 మంది రైతులు...

జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 20వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్య విధానం ద్వారా సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. అందుకు సంబంధించి మొత్తం 2,040 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు వారికి రాయితీ ఫలాలు అందలేదు. అంతకు ముందు ఏడాది కూడా అనుకున్న లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోయారు. 2016-17లో 10,800మంది రైతులు సూక్ష్మసేద్యం ద్వారా లబ్ధి పొందగా తదుపరి రెండు సంవత్సరాలు కూడా అదే ఊపు జిల్లాలో కొనసాగింది. తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు సూక్షసేద్యాన్ని గాలికొదిలేసింది

.

కేంద్రప్రభుత్వ నిధులు పక్కదారి

సూక్ష్మ సేద్యం అమలులో కేంద్రం కూడా తన వంతుగా రాయితీని అందిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సకాలంలో రాష్ట్ర ఖాతాలకు జమ అవుతున్నాయి. వాటికి రాష్ట్రప్రభుత్వ వాటా చేర్చి రైతులకు అందించాల్సిన ప్రభుత్వం ఆ నిధులను సైతం పక్కదారి పట్టిస్తుందనే విమర్శలు ఉన్నాయి. దీనిపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


వారం రోజుల్లో స్పష్టత వస్తుంది:

సూక్ష్మ సేద్యం రాయితీలను ఇంకా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంఽధించి మరో వారంరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు తోడు ప్రస్తుతం ఉన్న వాటిని మొత్తం పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న అన్నింటికి రాయితీ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం.

-పి. జెన్నమ్మ, ఏపీడీ


 రూ.20లక్షలు ఖర్చుచేశా.. రూపాయి అందలేదు:

కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, రైతు వెలిగండ్ల మండలం

నేను మొత్తం 15 ఎకరాల్లో మల్చరీ సాగు చేశాను. ప్రభుత్వ సాయం అందుతుందన్న ఆశతో డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం రూ.20లక్షల వరకు ఖర్చుచేశా. ఏడాదైనా ఇంతవరకు ఒక్క రూపాయి సబ్సిడీ రాలేదు. రుణాల కోసం, యంత్రాలు, పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు స్పందన లేదు. ఎటువంటి రుణం మంజూరుకాలేదు. నరేగా నుంచి కూడా సాయం అందలేదు.

చెట్లన్నీ ఎండుతున్నాయి..

-రావూరి వెంకటరెడ్డి, రైతు వెలిగండ్ల

15 ఎకరాల్లో బత్తాయి సాగు చేపట్టాను. 2019 చివర్లో అధికారుల మాట విని అప్పులు తెచ్చి డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేశాను. ఇంతవరకు ఎటువంటి సబ్సిడీ అందలేదు. బోర్లు పనిచేయక పది ఎకరాల్లో చెట్లు ఎండిపోయాయి. మిగతా చెట్లు కాయలు కాస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటేనే అప్పుల నుంచి బయటపడేది..


Updated Date - 2021-06-20T05:39:27+05:30 IST