ఉషోదయాన.. ఆరాధన

ABN , First Publish Date - 2020-11-23T03:47:53+05:30 IST

తుంగభద్ర తీరం జనసంద్రమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు క్యూ కట్టారు.

ఉషోదయాన.. ఆరాధన
విద్యుత్‌ దీపాల వెలుగులో అలంపూర్‌ ఆలయాలు

ఉషోదయానా తుంగభద్ర నదీ తీరం జనసంద్రమైనది.. విద్యుత్‌ దీపాల కాంతులు, నదిలో ప్రమిదల వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందింది.. ఆదివారం సెలవు కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ ప్రాంతాల నుంచి భక్తజనం వేలాదిగా తరలి వచ్చింది.. మంచును సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే పుష్కర ఘాట్ల వద్దకు క్యూ కట్టింది.. పుష్కర స్నానాలు ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకుంది..


- తుంగభద్ర పుష్కరాలకు పెరుగుతున్న భక్తులు

- ఆదివారం 54 వేల మంది హాజరు

- జోగుళాంబ అమ్మవారి దర్శనం కోసం బారులు


(గద్వాల-ఆంధ్రజ్యోతి)/అలంపూర్‌, నవంబరు 22 : తుంగభద్ర తీరం జనసంద్రమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు క్యూ కట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, పుల్లూరు, రాజోలి, వేణిసోంపురం ఘాట్ల వద్ద దాదాపు 54,693 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన స్నానాలు సాయంత్రం ఐదు గంటలకు ముగియాల్సి ఉండగా, భక్తులు రాత్రి ఏడు గంటల వరకు స్నానాలు చేశారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు గంటల కొద్దీ క్యూలో నిలపడ్డారు. అలాగే అలంపూర్‌ పుష్కర ఘాట్‌ వద్ద పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వచ్చిన భక్తులు దాదాపు ఐదు గంటల పాటు క్యూలో నిల్చున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం, వాసవీ అన్నదాన సత్రం, దేవాలయ అన్నదాన సత్రాలలో భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు. పుష్కరాలకు భక్తుల రాక పెరుగుతుండటంతో ఆదివారం నుంచి ప్రతి రోజూ 500 మందికి భోజన వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


54,693 వేల మంది హాజరు


ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అందులో ఒక్క అలంపూర్‌ ఘాట్‌ వద్ద సాయంత్రం నాటికి 31,885, పుల్లూరులో 7,656, రాజోలిలో 13,097, వేణిసోంపురంలో 2,055 మందిని కలుపుకొని మొత్తం 54,693 మంది హాజరైనట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.


ముమ్మర తనిఖీలు


అలంపూర్‌ వద్ద జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులు ఒకే మార్గాన ఘాట్‌ వద్దకు చేరుకునేలా పోలీసులు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు. ఘాట్‌ వద్ద వెళ్లేందుకు రెండె మార్గం ఉన్నా, ఆ మార్గాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే ఘాట్‌ వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరిని డిటెక్టర్స్‌ ద్వారా తనిఖీ చేసి, లోపలికి అనుమతిస్తున్నారు. అనంతరం అక్కవ వైద్య సిబ్బంది వారిని థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారికి కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 150 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా, అందరికీ నెగటివ్‌ వచ్చింది.


అక్కడ ‘జల్లు’.. ఇక్కడ మునకలు..


పుష్కరాలకు వచ్చే భక్తులు శాస్ర్తాల్లో చెప్పినట్లుగా స్నా నం చేస్తేనే పుష్కర ఫలం దక్కుతుంది. కానీ, తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న తుంగ భద్ర పుష్కరాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కొవిడ్‌-19 నేపథ్యంలో షవర్ల స్నానం మాత్రమే ఆచరించాలని ఆదేశించింది. ఈ రాష్ట్రంలో నది వెంట ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలో 15 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. ఈ ఘాట్ల వద్ద అన్ని చోట్ల షవర్లను అందుబాటులో ఉంచింది. భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది.


తెలంగాణలో మాత్రం తుంగభద్ర ప్రవహించే జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, రాజోలి, పుల్లూరు, వేణిసోంపురం ప్రాంతాల్లో ప్రభుత్వం పుష్కర ఘా ట్లను ఏర్పాటు చేసింది. ఈ ఘాట్ల వద్దకు వచ్చే భక్తులు షవర్ల కింద స్నానాలు చే యడంతో పాటు నదిలో స్నానాలు కూడా ఆచరించేందుకు అనుమతులు ఇచ్చింది. అన్ని చోట్ల కరోనా ర్యాపిడ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. పుష్కర స్నానాల కోసం వచ్చే ప్రతి భ క్తుడికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తోంది. దీంతో ఏపీలో కంటే తెలంగాణలోని పుష్కర ఘాట్ల వద్దకే భక్తజనం తరలివస్తోంది.


వన్‌ వేతో మరింత దూరం


అలంపూర్‌ పుష్కరఘాట్‌కు భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్ది పోలీసులు తిరుగు ప్రయాణికులను వన్‌వే పేరుతో దూరం పెంచుతూ వస్తున్నారు. అలంపూర్‌ చౌరస్తా నుంచి పుష్కర ఘాట్‌ వరకు 15 కిలోమీటర్లు ఉండగా, బైపాస్‌ ఏర్పాటు చేయడంతో అదనంగా ఐదు కిలోమీటర్ల దూరం పెరిగింది. దీంతో పుష్కరాలకు వస్తున్న భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్‌ ఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాలను పార్కింగ్‌ చేయిస్తుండటంతో, అక్కడి నుంచి భక్తులు కాలినడకన పుష్కర ఘాట్‌కు చేరుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో అలంపూర్‌ నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలను వన్‌వే పేరుతో ఉండవల్లి మీదుగా జాతీయ రహదారి వైపు మళ్లిస్తున్నారు. ఇది కూడా ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. 


భక్తులకు ఇబ్బంది


బందోబస్తు పేరుతో పోలీసులు వారి బంధువులను నేరుగా ఘాట్ల వద్దకు వదులుతున్నారు. మిగతా శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు ఘాట్ల వద్దకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపి, కాలి నడకన వెళ్లాల్సి వస్తున్నది. సైరన్‌తో వచ్చిన పోలీసు వాహనాలను ఆలయం ప్రాంగ ణం వరకు అనుమతిస్తున్నారు. కానీ, ఇతర వాహనాల్లో వచ్చిన వారిని లోపలికి రానివ్వడం లేదు. అందరికీ సమన్యాయం భక్తులు అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2020-11-23T03:47:53+05:30 IST