Abn logo
Nov 20 2020 @ 00:00AM

పుణ్య జల తరంగ... తుంగభద్ర!

Kaakateeya

మానవుల జీవనానికీ, పురోగతికీ జీవనాడులు నదులు. నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే వర్ధిల్లాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతి నదులతో పెనవేసుకొంది. అందుకే నదీస్నానాన్ని పరమ పవిత్రంగా పూర్వులు భావించి, భావి తరాలకు నిర్దేశించారు. అలాంటి పవిత్ర నదులకు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఏర్పరచిన సందర్భాలే పుష్కరాలు. పవిత్రమైన పన్నెండు పుష్కర నదుల్లో ఒకటైన తుంగభద్రకు నేటి నుంచీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 


  • నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు


తుంగభద్ర తరంగాలను దర్శించడంతోనే పాపాలన్నీ సమసిపోతాయనీ, అమృతమయమైన ఆ జలాన్ని తాగితే గంగానది స్నానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుందనీ పెద్దల మాట. అందుకే ‘‘తుంగా పానం గంగా స్నానం’’ అనే నానుడి వాడుకలోకి వచ్చింది.


రెండు నదుల సంగమం

నిత్య పూజా సంకల్పంలో ‘కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః’ అనే శ్లోకం ఉంటుంది. పంచ గంగలుగా ప్రసిద్ధి పొందిన నదుల్లో తుంగభద్ర ఒకటి. నిజానికి పేరు ఒకటిగా వాడుకల్లో ఉన్నా ఈ నది ‘తుంగ’, ‘భద్ర’ అనే రెండు నదుల సంగమం. ఈ నదులు కర్ణాటకలోని పశ్చిమకనుమల్లో వరాహపర్వతంపై జన్మించాయి. పురాణ కథనం ప్రకారం... భూదేవిని రక్షించడానికి శ్రీహరి వరాహావతారం ధరించి, హిరణ్యాక్షునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన స్వేద బిందువులు చెంపల మీద నుంచి కిందికి జారాయి. కుడి చెంప మీద నుంచి జారిన బిందువు ‘తుంగ’గా, ఎడమ చెంప నుంచి జారిన బిందువు ‘భద్ర’గా రూపుదిద్దుకున్నాయి. కాగా, వరాహస్వామి రెండు కోరలూ భూమి మీద వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయనీ, అవి గుచ్చుకున్న చోట నీరు పైకి ఊబికి ‘తుంగ’, ‘భద్ర’ అనే నదులుగా రూపుదిద్దుకున్నాయనీ మరో కథనం. తుంగా నది ఒడ్డున అనేక తీర్థాలున్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని ‘తీర్థహళ్ళి’ అని పిలుస్తారు. శ్రీ ఆదిశంకరాచార్యులు దేశం నలు దిక్కులా స్థాపించిన పీఠాల్లో దక్షిణాది పీఠమైన శృంగేరికి ఆ నది చేరుతుంది. అక్కడి నుంచి పలు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నేటి షిమోగా ప్రాంతానికి వస్తుంది. భద్రానది కూడా పలు ప్రదేశాల మీదుగా షిమోగాకు వచ్చి... అక్కడికి సమీపంలోని కుర్లీ అనే చోట తుంగతో సంగమిస్తుంది. అలా ‘తుంగభద్ర’గా మారిన ఈ నదీమతల్లి కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోంచీ ప్రవహిస్తూ హంపీ క్షేత్రం చేరుకుంటుంది. అలనాటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని అయిన హంపీ నగరం సకల కళలకూ కాణాచిగా, రాయలవారి పాలనలో స్వర్ణయుగ కేంద్రంగా వాసికెక్కింది.


విద్యల నిలయమైన హంపీ విజయనగరంలో హరిహరేశ్వరస్వామి, విరూపాక్ష స్వామి, నృసింహ స్వామి, కోదండ రామస్వామి ఆలయాలు, ఏకశిలా రథం లాంటివి చూడదగిన విశేషాలు. కర్ణాటక సంగీతానికి అపారమైన సేవ చేసిన పురందరదాసు జీవితాంతం నివసించిన విఠలాలయం తుంగభద్ర తీరాన్నే ఉంది. అంతేకాదు, రామాయణంలో ప్రస్తావితమైన కిష్కింద పర్వత పంక్తులు ఇక్కడివేననీ, ఆ కావ్యంలో ప్రస్తావితమైన పంపా సరోవరం తుంగభద్రానదేననీ చెబుతారు. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే తుంగభద్రానది ఆలంపూర్‌కు సుమారు పది కిలోమీటర్ల  దూరంలోని కూడలి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. నేరుగా సముద్రంలో కలవని పుష్కరనది కావడం తుంగభద్ర విశేషాల్లో మరొకటి. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ రాఘవేంద్రస్వామి నిలయమైన మంత్రాలయం, శక్తిపీఠమైన తెలంగాణలోని ఆలంపూర్‌ ఆలయాలు తుంగభద్రా తీరంలోనే ఉన్నాయి. సంగమేశ్వరంలో కూడా అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి.


తుంగభద్రా స్నానం సకల శుభప్రదం

రామాయణ మహాకావ్యంలో, మత్స్య, భాగవత, అగ్ని తదితర పురాణాల్లో ఈ నది ప్రస్తావన ఉంది. సకల దేవతలూ పూజించే ఈ నదీ జలాన్ని తాగిన వారికి నరక బాధలు ఉండవనీ, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందనీ పురాణాలు చెబుతున్నాయి. పన్నెండు పవిత్ర పుష్కర నదుల్లో పదోది తుంగభద్ర. దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. పన్నెండు రోజుల పాటు కొనసాగే ఈ పుష్కర సమయంలో ఆ నదీ స్నానం అత్యంత పుణ్యప్రదమంటారు పెద్దలు. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు జరుగుతాయి. ఒక చేతిలో స్వర్ణకలశం, మరొక చేతిలో చెరుకుగడతో మకరవాహినిగా తుంగభద్రా మాత దర్శనమిస్తుంది. ‘జయ జననీ గంగానదీ తుల్య తుంగోత్తరంగావళీ శోభి తుంగా ధునీ తీర సంరాజి శృంగాద్రి వాసైకలోలే’... గంగానదితో సమానమైన మహిమ కలిగిన తుంగభద్ర స్నానం సకల శుభాలనూ చేకూర్చుతుందన్నది శాస్త్రవచనం.

- ఎ. సీతారామారావు 


Advertisement
Advertisement