హారతిచ్చి.. తుంగభద్రకు మొక్కి..

ABN , First Publish Date - 2020-11-21T08:43:42+05:30 IST

పుష్కరుడు మకరరాశిలోకి శుక్రవారం మధ్యాహ్నం 1:21కి ప్రవేశించడంతో తుంగభద్ర పుష్కరాలు మొదలయ్యాయి.

హారతిచ్చి.. తుంగభద్రకు మొక్కి..

మధ్యాహ్నం 1.21 గంటలకుమకరరాశిలోకి ప్రవేశించిన పుష్కరుడు

పసుపు, కుంకుమ, సారె సమర్పించిఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి జగన్‌


కర్నూలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పుష్కరుడు మకరరాశిలోకి శుక్రవారం మధ్యాహ్నం 1:21కి ప్రవేశించడంతో తుంగభద్ర పుష్కరాలు మొదలయ్యాయి. పన్నెండు రోజుల పాటు సాగే ఈ పుష్కరాలను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్థానిక సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌లో పూజలు నిర్వహించి ప్రారంభించారు. సీఎం సంప్రదాయబద్ధంగా పట్టు పంచె, తెల్లని చొక్కా ధరించి పుష్కరాల ప్రారంభత్సోవంలో పాల్గొన్నారు. తొలుత ఘాట్‌ వద్ద ఉన్న తుంగభద్ర నదికి నమస్కరించి పూలమాల సమర్పించారు. పండితులు వేద మంత్రాలు చదువుతుండగా ఆయన పుష్కరుడిని ఆహ్వనిస్తూ పూజలు చేశారు. నది దేవతకు ప్రీతిగా పసుపు, కుంకుమ అర్పించి చీరసారె సమర్పించారు. నదికి వేదపండితులు పంచ హారతులు ఇచ్చారు.


అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా నదికి హరతులు ఇచ్చి పూజలు చేశారు. నదీ జలాలను తలపై చల్లుకున్నారు. తదనంతరం అక్కడ నిర్మించిన ప్రత్యేక యాగశాలకు చేరుకుని అప్పటికే ఆవాహన చేసిన కలశాలకు పుష్పాలు సమర్పించారు. పండితుల ఆధ్వర్యంలో జరగుతున్న ఆయుఃహోమానికి పూర్ణ ఫలాన్ని సీఎం చేతుల మీదుగా యాగశాలకు సమర్పించారు. పండితులు సీఎంకు వేదాశీర్వచనం ఇచ్చారు. పుష్కర పూజలు పూర్తి చేసుకున్న అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డి 1.50 గంటలకు అమరావతికి తిరుగు పయనమయ్యారు. 


బీజేపీ, వామపక్ష నేతలు అరెస్టు

సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున హౌస్‌ అరెస్టు చేశారు. పుణ్యస్నానాలకు అనుమతినివ్వనందున బీజేపీ నేతలు, కార్మికుల సమస్యలను నెరవేర్చాలని సీపీఎం, సీపీఐ నేతలు సీఎం పర్యటనను అడ్డుకుంటామని ముందే హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ జిల్లా నాయకురాలు బైరెడ్డి శబరి, హరీశ్‌ బాబు, సీపీఎం, సీపీఐ ప్రతినిధులు నిర్మల, కె. రామాంజనేయులు, రాజశేఖర్‌, వెంకట్రాముడు, ఏఐటీయూసీ నాయకులు మనోహర్‌ మాణిక్యాన్ని హౌస్‌ అరెస్టు చేశారు.


పుష్కర యాత్రికులకు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘నదులు నాగరికతకు చిహ్నాలు. జలమే జీవం. జలంతోటే జనం. నదులు మన వారసత్వ సంపద. నదీమ తల్లులకు పూజాదికాలతో పాటు మన పెద్దలను సంస్మరించుకోవడం, ప్రకృతితో మమేకం కావడం పుష్కరాల అంతరార్థం.  ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను భక్తిప్రపత్తులతో జరుపుకోవడం ఆనవాయితీ. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నదే’’ అని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా పుష్కర యాత్రికులకు, తెలుగు వారందరికీ శుక్రవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2020-11-21T08:43:42+05:30 IST