అరుదైన వ్యాధితో.. వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్న యువతి..!

ABN , First Publish Date - 2021-10-15T02:38:47+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా టర్కీకి చెందిన రూమేసా గెల్గీ తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో స్థానం దక్కించుకుంది.

అరుదైన వ్యాధితో.. వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్న యువతి..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా టర్కీకి చెందిన రూమేసా గెల్గీ(24) తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఏకంగా 7 అడుగుల 0.7 అంగుళాల పొడవుతో గెల్గా..ప్రస్తుతం జీవించి ఉన్న మహిళల్లో అత్యంత పొడగరిగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. టర్కీ దేశానికి చెందిన గెల్గీ ఇలా అసాధారణంగా ఎదగడానికి కారణం ఆమెకు ఉన్న అరుదైన వ్యాధే. వీవర్స్ సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా ఆమె దేహం ఇతరుల కంటే వేగంగా పెరుగుతోంది. వీవర్స్ సిండ్రోమ్‌తో ఇతర శారీరక సమస్యలూ కలుగడంతో ఆమె ఎక్కువ సమయం చక్రాల కుర్చీకే పరిమితమవుతుంది. కొద్ది సేపు మాత్రమే ఆమె నడవగలదు. 


ఇలా వేగంగా ఎత్తు పెరగడంతో ఆమె టీనేజ్ వయసులోనే ఓ గిన్నిస్ రికార్డు సాధించింది. అత్యధిక పొడవున్న టీనేజర్‌గా 2014లో రికార్డు సాధించింది. ఇప్పుడు రెండోసారి కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ప్రపంచంలో అత్యంత పొడవైన పురుషుడిగా రికార్డు సృష్టించిన సుల్తాన్ కొసెన్ కూడా టర్కీకి చెందిన వారే. మెదడులోని క్యాన్సర్ కారణంగా సుల్తాన్ ఇలా అసాధారణ స్థాయిలో పొడవు పెరిగారు. ఈ ఉదంతం ప్రస్తుతం టర్కీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. 


‘‘భిన్నంగా ఉన్నంత మాత్రాన మనం నష్టపోయేది ఏమీ లేదు..దీని ద్వారా ఇతరులు చేయలేనిది మనం చేయచ్చు’’ అంటూ గెల్గీ చెప్పిన సందేశాన్ని కూడా గిన్నిస్ రికార్డ్ వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. ‘‘నీవు ఎల్లప్పుడూ ఇలాగే ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి’’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2021-10-15T02:38:47+05:30 IST