బయట తిరిగేస్తూ... భయాన్ని వదిలేస్తూ!

ABN , First Publish Date - 2021-04-21T04:21:28+05:30 IST

--ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. సెకెండ్‌ వేవ్‌లో కరోనా కేసులు ఉధృతమవుతున్నా... మరణాలు సంభవిస్తున్నా ఇటు ప్రజల్లో కనీస జాగ్రత్తలు కనిపించకపోగా..యంత్రాంగం కూడా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. గతంలో కరోనా కేసులు బయటపడిన వెంటనే సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేవారు.

బయట తిరిగేస్తూ... భయాన్ని వదిలేస్తూ!
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ

కుటుంబంలో బాధితులు ఉన్నా...ఆగని సంచారం

ఊసులేని ప్రైమరీ కాంటాక్ట్స్‌ గుర్తింపు

జాడలేని కంటైన్మెంట్‌ జోన్లు

ఇలాగే కొనసాగితే కష్టమే

(విజయనగరం-ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని వైకేఎమ్‌ కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం యథావిధిగా బయట తిరుగుతున్నారు. ద్విచక్ర వాహనాలపై బహిరంగ ప్రదేశాలకు, మార్కెట్లకు తిరిగి వస్తున్నారు. 


విజయనగరంలో చాలా మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఇటువంటి వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కానీ అప్పటివరకూ వీరితో కాంటాక్ట్‌ అయిన తోటి విద్యార్థులు, స్నేహితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కనీసం వీరికి నిర్థారణ పరీక్షలు చేయడం లేదు.


విజయనగరంలో గుర్తింపు ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వీరు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. కానీ సంబంధిత కళాశాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించడం లేదు. దీంతో అక్కడ ఎటువంటి నిబంధనలూ అమలు కావడం లేదు. సాధారణ రోజుల లాగానే విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. 


ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. సెకెండ్‌ వేవ్‌లో కరోనా కేసులు ఉధృతమవుతున్నా... మరణాలు సంభవిస్తున్నా ఇటు ప్రజల్లో కనీస జాగ్రత్తలు కనిపించకపోగా..యంత్రాంగం కూడా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. గతంలో కరోనా కేసులు బయటపడిన వెంటనే సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేవారు. నిర్థారణ పరీక్షలు చేసేవారు. బాధితుడి నివాసం చుట్టూ కొంత భాగాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించేవారు. రాకపోకలను నిషేధించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి కానరావడం లేదు. ఒక కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌గా వచ్చినా మిగతా వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. తోటి విద్యార్థులకు, స్నేహితులకు కరోనా సోకినా మిగతా వారు నిర్థారణ పరీక్షలు చేసుకోవడం లేదు సరికదా..ఎటువంటి భయం లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కనీస నిబంధనలు పాటించడం లేదు. సినిమా థియేటర్లు, బహిరంగ మార్కెట్లలోనూ అదే పరిస్థితి. ఈ నిర్లక్ష్యం ఫలితంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మార్చి చివరి వారం వరకూ సాధారణ స్థితిలో ఉన్న కేసులు..ఏప్రిల్‌ నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రోజుకు సగటున 300కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.  మంగళవారం 330 కేసులు నమోదుకాగా..యాక్టివ్‌ కేసులు 1,500కుపైగా ఉన్నాయి. 


 తగ్గిన నిర్థారణ పరీక్షలు

గతంతో పోల్చుకుంటే కరోనా నిర్థారణ పరీక్షలు సైతం తగ్గుముఖం పట్టాయి.  జిల్లావ్యాప్తంగా 31 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రత్యేక చికిత్సకు ఐదు ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ జిల్లా కేంద్రాస్పత్రి, మిమ్స్‌లో మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి. 1,800 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. కానీ ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రోజుకు సగటున వందలాది కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో సైతం కరోనా చికిత్స అందించాల్సిన అవసరముంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా అంతంతమాత్రంగానే ఉంది. మొన్నటి వరకూ వ్యాక్సిన్ల కొరత ఉండగా..21,500  కోవిషీల్డ్‌ డోసులు, 5 వేల కోవాగ్జిన్‌ డోసులు జిల్లాకు వచ్చినట్టు చెబుతున్నారు. కానీ ఆ స్థాయిలో నిల్వలు కనిపించడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పురోగతి కనిపించడం లేదు. 


ప్రయాణాల్లో అదే తీరు!

కరోనా విజృంభిస్తోంది. సెకెండ్‌ వేవ్‌లో గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తంగా మెలగాల్సిన అవసరముంది. కానీ ఎక్కడా నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. ప్రజలు   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మూల్యం చెల్లించుకుంటున్నారు. మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా మారింది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ఉంది. భౌతిక దూరం, శానిటైజర్‌ వినియోగం వంటివి కానరాలేదు. బస్సులు వచ్చినప్పుడు ఒకరినొకరు నెట్టుకున్నారు. పోటాపోటీగా బస్సులు ఎక్కారు. దీంతో తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. 


బాధ్యతగా వ్యవహరించాలి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా నిబంధనలు పాటించాలి. స్వీయరక్షణకు పెద్దపీట వేయాలి. విధిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటిచడంతో పాటు శానిటైజ్‌ చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. సెకెండ్‌ వేవ్‌లో కేసుల ఉధృతి అధికంగా ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు. జిల్లాలో వైరస్‌ నిర్థారణతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 

- డాక్టర్‌ రమణకుమారి, డీఎంహెచ్‌వో, విజయనగరం




Updated Date - 2021-04-21T04:21:28+05:30 IST