హైదరాబాద్‌లో టీవీ ఛానెల్‌ ఎడిటర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-14T14:20:53+05:30 IST

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో

హైదరాబాద్‌లో టీవీ ఛానెల్‌ ఎడిటర్‌ ఆత్మహత్యాయత్నం

  • సోషల్‌ మీడియాలో వేధింపులు..
  • స్థానిక టీవీ ఛానెల్‌ ఎడిటర్‌ ఆత్మహత్యాయత్నం
  • కారకుడైన వ్యక్తి అరెస్ట్‌, రిమాండ్‌

హైదరాబాద్ సిటీ/మదీన : పాతబస్తీలోని ఓ టీవీ చానెల్‌ ఎడిటర్‌, సోషల్‌ వర్కర్‌ అయిన ఓ మహిళను సోషల్‌ మీడియా వేదికగా వేధిస్తున్నాడనే ఆరోపణలపై సయ్యద్‌ సలీమ్‌ అనే వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సయ్యద్‌ నౌహిదా ఖాద్రి అనే మహిళ స్థానికంగా ఉన్న ఎన్‌ఆర్‌క్యూ 24 చానెల్‌కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌.  దీంతోపాటు ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. రైన్‌బజార్‌కు చెందిన సయ్యద్‌ సలీమ్‌ తనను కించపరుస్తూ యూ ట్యూబ్‌లో తనపై వీడియోలు పెట్టడంతోపాటు ఫేస్‌బుక్‌ లైవ్‌లో అసభ్యంగా, అమర్యాదగా కామెంట్లు చేస్తున్నాడని మే 25వ తేదీన సీసీఎస్‌ పోలీసులకు, చాంద్రాయణగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 


అయినా వైఖరి మార్చుకోని సయ్యద్‌ సలీమ్‌ శనివారం కూడా మరోసారి ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమెపట్ల అమర్యాదగా మాట్లాడాడు. దీంతో మనస్థాపానికి గురైన సయ్యద్‌ నౌహిదా ఖాద్రి ఆదివారం తెల్లవారుజామున నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సంతో్‌షనగర్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సయ్యద్‌ సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీ‌స్‌స్టేషన్‌ వద్ద హైడ్రామా

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సయ్యద్‌ సలీమ్‌ను రిమాండ్‌కు తరలించే సమయంలో చాంద్రాయణగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. సుమారు 50 మంది నౌహిదా ఖాద్రి మద్దతుదారులు పోలీ‌స్‌స్టేషన్‌ ముందు గుమిగూడి పోలీస్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. సలీమ్‌ను దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేయడానికి యత్నించారు. పోలీసులు అదనపు బలగాలతో వారిని అడ్డుకుని బందోబస్తు మధ్య సలీమ్‌ను మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ్‌ జైలుకు తరలించారు.

Updated Date - 2021-06-14T14:20:53+05:30 IST