అదృష్టం అలా కలిసొచ్చింది

ABN , First Publish Date - 2021-06-14T06:09:44+05:30 IST

ఒక అందమైన కల... రంగుల ప్రపంచంలో తారనై తళుకుమనాలని! లెక్కకు మించి ఆడిషన్లు... ఎక్కడికి వెళ్లినా తిరస్కరణలు... ఇక వద్దు... వదిలేద్దామనుకున్నప్పుడు అవకాశం ఆహ్వానం పలికింది...

అదృష్టం అలా కలిసొచ్చింది

ఒక అందమైన కల... రంగుల ప్రపంచంలో తారనై తళుకుమనాలని! లెక్కకు మించి ఆడిషన్లు... ఎక్కడికి వెళ్లినా తిరస్కరణలు... ఇక వద్దు... వదిలేద్దామనుకున్నప్పుడు అవకాశం ఆహ్వానం పలికింది. ఆ తరువాత మరో మలుపు... దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రాజెక్ట్‌ ‘కృష్ణ తులసి’లో ప్రధాన పాత్ర. ‘శ్యామ’గా తెలుగువారి అభిమానపాత్రమైన నటి ఐశ్వర్య చెప్పే ముచ్చట్లు ఇవి... 


స్కూల్‌... డిగ్రీ... ఉద్యోగం... ఇది కాదు నేను కోరుకున్నది. రొటీన్‌కు భిన్నంగా... అభిరుచికి దగ్గరగా జీవించాలనుకున్నాను. బడిలో ఉన్నా, కాలేజీకి వెళ్లినా, నా మనసులో ఎప్పుడూ ఒకటే కోరిక... నటిని కావాలని! ఎందుకో తెలియదు... చిన్నప్పటి నుంచి నాలో అది బలపడిపోయింది. కర్ణాటక బాగల్‌కోట్‌ జిల్లా జంఖండి మా సొంతూరు. అయితే నాన్న ఉద్యోగరీత్యా హుబ్లీలో స్థిరపడ్డాం. ఆయన స్కూల్‌ ప్రిన్సిపాల్‌. నేను బీకాం కూడా అదే ఊళ్లో చదివాను. 


వద్దన్నా వదలలేదు... 

కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. అప్పుడే నటిగా ప్రయత్నిస్తానంటే ఇంట్లో వాళ్లు వద్దంటే వద్దన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే ఇది విభిన్నమైనది. తెలియని చోట ఇబ్బందులు పడతానని అమ్మా నాన్నల భయం. వారి మాటను కాదనలేకపోయాను. రెండేళ్ల కిందట డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం చేయాలనిపించలేదు. నా కల నిజం చేసుకోవాలనుకున్నాను. అదే విషయం అమ్మా నాన్నలకు చెప్పాను. ఎప్పటిలానే నో అన్నారు. ఈసారి నేనూ పట్టు పట్టాను. చివరకు ఎలాగో ఒప్పుకున్నారు. 


అసలు కష్టాలు అప్పుడే... 

ఇంట్లో వాళ్లు ఓకే అనడంతో వెంటనే బెంగళూరు వెళ్లాను. అక్కడి ఓ యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో మూడు నెలలు శిక్షణ తీసుకున్నా. కోర్సు అయిపోయింది. మనకు తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న అనుభూతి! కానీ అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో మొదటిసారి ఆడిషన్స్‌కు వెళ్లాను. రెండు... మూడు... సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఫలితం కనిపించడంలేదు. యాభై దాకా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఎక్కడికి వెళ్లినా ‘వేరేవారిని తీసుకున్నాం. చిన్న రోల్‌ ఉంది చేస్తావా’ అని అడిగేవారు. నచ్చక వచ్చేసేదాన్ని. 


సీఎస్‌ చదువుదామని... 

తిరిగి తిరిగి అలసట వచ్చేది కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏదో ఊహించుకున్నాను. ఇక లాభం లేదని సీఎస్‌ (కంపెనీ సెక్రటరీ) కోసం కోచింగ్‌లో చేరాను. నటిని కాలేకపోతే సీఎస్‌ అవ్వాలన్నది నా కోరిక. అదే ఎందుకంటే తమ్ముడు సీఏ. వాడిని చూసి సీఎస్‌ చేయాలనుకున్నా. అయితే అలా కోచింగ్‌లో చేరానో లేదో... ఇలా అవకాశం తలుపు తట్టింది. ‘యారివళు’ అనే కన్నడ సీరియల్‌ కోసం ‘ఉదయా టీవీ’ నుంచి పిలుపు వచ్చింది. ప్రధాన పాత్ర కాదు కానీ... ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు. సీరియల్‌ మొదలైంది. 




అరుదైన అవకాశం...  

కన్నడలో ‘యారివళు’ చేస్తున్న సమయంలోనే ఊహించని పిలుపు వచ్చింది. మెగా దర్శకుడు రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్‌ ‘కృష్ణ తులసి’లో ప్రధాన పాత్ర నన్ను వరించింది. ఆయనలాంటి దిగ్గజాల ప్రాజెక్ట్‌లో చేయడమంటే ఏ కళాకారుడికైనా పెద్ద కల. అంతటి అరుదైన అవకాశం నాకు లభించింది. అదీ కెరీర్‌ ఆరంభంలోనే! నాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది. నన్నే తీసుకోవడానికి కారణమేంటంటే నేను కచ్చితంగా చెప్పలేను. నిజానికి నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. తెలుగు ఒక్క ముక్క రాదు. బహుశా నేనైతే సరిపోతాననుకున్నారేమో! రాఘవేంద్రరావు గారు సెట్స్‌కు రారు. అయితే ‘కృష్ణ తులసి’ ఫొటో షూట్‌ సందర్భంలో ఒకసారి కలిశాను. ఆయన ముందు నిలుచోవాలంటే మొదట కొంచెం భయమేసింది. తరువాత సార్‌తో ఒక ఫొటో షూట్‌ కూడా చేశాను. నా ఆనందం మాటల్లో చెప్పలేను. ‘చాలా బాగా చేస్తున్నావమ్మా’ అంటూ ఆశీర్వదించారు. ‘ప్రేక్షకులతో ఇంకా కనెక్ట్‌ అవ్వాలి’ అంటూ కొన్ని సూచనలు చేశారు. 


స్టిచ్చింగ్‌... కుకింగ్‌...

ప్రస్తుతం సీరియల్‌తో పాటు కన్నడ చిత్రం ‘క్షేత్రపతి’లో నటిస్తున్నా. నవీన్‌ శంకర్‌ హీరో. కరోనా వల్ల షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. షూటింగ్‌లు లేనప్పుడు ఇంట్లో ఉంటే స్టిచింగ్‌ చేస్తుంటా. లేకపోతే రకరకాల వంటలు ప్రయత్నిస్తుంటా. జొన్న రొట్టె, వంకాయ కర్రీ కాంబినేషన్‌ నాకు ఇష్టమైన వంటకం. తరచూ వండుతుంటాను. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూస్తుంటాను. అల్లు అర్జున్‌ నా అభిమాన హీరో. అతని స్టయిల్‌, నటన సూపర్‌. హీరోయిన్లలో సమంత ఇష్టం. ఇక ప్రస్తుతానికి నాకంటూ పెద్ద లక్ష్యాలేమీ లేవు. వచ్చిన అవకాశాలు వినియోగించుకొంటూ, నటిగా మరింత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే ధ్యేయం. ఇక్కడి అమ్మాయిలా నన్ను తెలుగువారు అభిమానిస్తున్నారు. ఈ ఆదరాభిమానాలు కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను. 


వైవిధ్యమున్న పాత్ర... 

‘జీ తెలుగు’లో ప్రసారమవుతున్న ‘కృష్ణ తులసి’లో నాది వైవిధ్యమున్న ‘శ్యామ’ పాత్ర. ఆమె కృష్ణుడి భక్తురాలు. ఆయనలానే నల్లని ఛాయ. అమాయకత్వం నిండిన అమ్మాయి. నల్లగా ఉన్నావని అందరూ చిన్నచూపు చూస్తారు. చులకనగా మాట్లాడతారు. కానీ ఇవేవీ శ్యామ పట్టించుకోదు. ఈ అసమానతలపై పోరాడుతూ తను ఎలా నిలబడిందన్నది కథ. 

కెరీర్‌ మొదట్లోనే డీగ్లామర్‌ రోల్‌ ఎలా ఒప్పుకున్నారని చాలామంది అడుగుతుంటారు. నిజానికి ఇది డీగ్లామర్‌ పాత్ర కాదు. శ్యామ నల్లని పిల్లే అయినా ఎంతో అందంగా ఉంటుంది. నాకు సీరియల్‌కు ముందే చెప్పారు... ‘బ్లాక్‌ మేకప్‌ వేస్తాం’ అని! రొటీన్‌ గ్లామర్‌ రోల్స్‌ ఎప్పుడైనా చేయవచ్చు. కానీ ఇలాంటి కథాబలం ఉన్న అరుదైన పాత్రలు ఎప్పుడో కానీ రావు కదా! ఇలాంటివి చేస్తేనే ప్రేక్షకులకు దగ్గరవుతాం. ఇప్పటికి 90కి పైగా ఎపిసోడ్స్‌ అయ్యాయి. అనుకున్నదాని కంటే పది రెట్లు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్‌ కన్నడలో కూడా డబ్బింగ్‌ అవుతోంది. అక్కడా విపరీతమైన రేటింగ్స్‌. మా వాళ్లందరూ చూస్తున్నారు. నాడు నటన వద్దన్నా ఇప్పుడు వాళ్లు చాలా చాలా హ్యాపీ. 


‘ఐశ్వర్యా’భినయం...

  •  చదివింది బీకాం. 
  •  నటి కావాలన్నది కల. 
  •  కన్నడ ‘యారివళు’తో బుల్లితెరకు పరిచయం 
  •  తెలుగులో ‘కృష్ణ తులసి’గా అభినయం 
  •  హీరో అల్లు అర్జున్‌ అంటే అభిమానం 
  •  జొన్న రొట్టె, వంకాయ కర్రీ ఇష్టమైన వంటకం.

- హనుమా

Updated Date - 2021-06-14T06:09:44+05:30 IST