Abn logo
Mar 30 2021 @ 18:40PM

టీవీ షో చూసి పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు!

న్యూఢిల్లీ: సినిమాల్లో కనిపించే కొన్ని సీన్లు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. ఇలాంటి వాటిలో ఎక్కువగా ఫైట్ సీన్స్ ఉంటాయి. మరికొన్ని లాజిక్‌కు ఏమాత్రం చిక్కవు. అయినా, సినిమా అంటూ అభిమానులు కూడా సర్దుకుపోతుంటారు. ఇప్పుడు టీవీ షోలు కూడా ఇలాంటి పోకడనే అనుసరిస్తున్నాయి. అయితే, సినిమా అభిమానుల్లా బుల్లితెర ప్రేక్షకులు వాటిని అంత ఈజీగా జీర్ణించుకోలేరు.


ఇటీవల సీరియళ్లలో ఈ తరహా సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సీన్ మాత్రం టీవీ ప్రేక్షకులనే కాదు నెటిజన్లు సహా ఏకపక్షంగా అందరిని పిచ్చెక్కిస్తోంది. ఈ సీన్ చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు.. ‘‘అశోక చక్రవర్తి దుర్యోధనుడితో పోరాడిన తీరు అద్భుతం’’, ‘‘రావణాసురుడితో ఎన్టోవోడు చేసిన ఫైట్ రామయణానికే హైలెట్’’, ‘‘చంద్రబాబు ఔరంగజేబుతో పోరాడి ఉండాల్సింది కాదు’’ అంటూ ఏవోవో మాట్లాడుతున్నారు. మీరు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వీడియోను చూడండి.

సాధారణంగా ప్రియురాలి మనసు గెలుచుకునేందుకు ప్రియుడు ఎన్నెన్నో చెబుతాడు. చుక్కలు కోసుకురానా? చంద్రుడ్ని తెచ్చి నీ జడలో తురమనా? అంటూ ఆమె మనసును గెలించేందుకు ఏవోవో వరాలు ఇస్తుంటాడు. అయితే, ఇది మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. వధువును పెళ్లాడేందుకు వరుడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏకంగా చంద్రుడినే ఖండఖండాలుగా (చాంద్ కా టుక్‌డా) చేసి ముక్కలు తీసుకొచ్చేశాడు.


అప్పుడే మైకం కమ్ముతోందా? అయిపోలేదు, కాస్తా ఓపిక తెచ్చుకోండి. తొలుత చంద్రుడిని తీసుకొచ్చేందుకు నానా కష్టాలు పడతాడు. అది వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ‘ప్లాన్ బి’ అమలు చేస్తాడు. ఎంచక్కా కారేసుకుని చంద్రుడి వద్దకు దూసుకెళ్తాడు. కాస్త దూరంలో ఆగి తన వద్ద ఉన్న మ్యాజిక్ స్టిక్‌ను దానిపైకి విసురుతాడు. అది చంద్రుడి నుంచి కొన్ని ముక్కలు చేస్తుంది. అవి కిందపడడంతో అతడి కుటుంబ సభ్యుల్లో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు. 


సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. నెటిజన్లలో కొందరు విచిత్ర హావభావాలతో భయపెడుతున్నారు. తొలుత నవ్వుతున్నారు. ఆ తర్వాత పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆశ్చర్యపోతూ తామెందుకు చేయలేమంటూ కార్లు బయటకు తీస్తున్నారు.


జనాలను ఇంతగా వెర్రెక్కిస్తున్న ఈ టీవీ షో పేరు ‘యే జాదు హై జిన్ కా’. స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ఫాంటసీ డ్రామా సీజన్ 2లోని సీన్ ఇది. అక్టోబరు 2019-నవంబరు 2020 మధ్య ప్రసారమైంది. ఇప్పుడైతే ఇది ప్రసారం కావడం లేదు కానీ, ఈ సీన్ బయటకు వచ్చిన తర్వాత ఈ షోపై జనాల్లో ఆసక్తి రేగింది. ఈ సీన్ చూసిన వారు ఆ తర్వాత ఏమైందన్న ఉత్సుకత వారిని నిలువనీయడం లేదు. ఆగలేని వారు హాట్‌స్టార్‌‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఇక ఈ వీడియోపై మీమ్‌లు, కామెంట్లతో సోషల్ మీడియో హోరెత్తిపోతోంది. మరికొందరైతే, చంద్రుడిపైకి వెళ్లేందుకు ‘నాసా’ అనవసరంగా ట్రిలియన్ డాలర్లు ఖర్చుచేస్తోందని వాపోతున్నారు.


జానపద బ్రహ్మ విఠలాచార్య కానీ బతికి ఉంటే ఈ సీన్ చూశాక ఏమైపోయి ఉండేవాడోనని కొందరు కామెంట్ చేస్తుండగా, వందలాది అడుగుల ఎత్తైన భవనాలపై నుంచి అలవోకగా దూకేసేవారు, వేగంగా వెళ్తున్న రైళ్లను ఒంటి చేత్తో సింపుల్‌గా ఆపేసే మన హీరోలు ఏమైపోతారోనని ఇంకొందరు అంటున్నారు. ఇప్పటి వరకు ఏ ‘వుడ్’లోనూ కనిపించని మహాద్భుతమైన సీన్‌ను చూసి మీరూ తరించండి. అయితే, ‘వీడియో వ్యూయింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు యువర్ హెల్త్’ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement