24 గంటల వ్యవధిలో..ముగ్గురికి రెండేసి ఊపిరితిత్తుల మార్పిడి

ABN , First Publish Date - 2021-11-26T09:41:28+05:30 IST

కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముగ్గురు వ్యక్తులకు రెండు ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించారు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది.

24 గంటల వ్యవధిలో..ముగ్గురికి రెండేసి ఊపిరితిత్తుల మార్పిడి

8 గంటల్లో ప్రక్రియ పూర్తి.. కిమ్స్‌ ఆస్పత్రి వైద్యుల ఘనత

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముగ్గురు వ్యక్తులకు రెండు ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించారు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది. ఇది అరుదైన ఘటన అని.. ఆసియాలో మొదటిసారి అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రపంచంలో కూడా ప్రథమమని భావిస్తున్నట్లు వివరించారు. వారి వివరాల మేరకు.. ఆస్పత్రిలో ముగ్గురు రోగుల ఊపిరితిత్తులు తప్పనిసరిగా మార్చాల్సి ఉంది. దాతల కోసం నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాతలు దొరకడంతో కదలిక వచ్చింది. మొదటి జత ఉపిరితిత్తులను హైదరాబాద్‌, రెండో జతను అహ్మదాబాద్‌లో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి సేకరించారు. అహ్మదాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం వీటిని రోగులకు అమర్చారు. మూడో జత ఊపిరితిత్తులను విశాఖపట్నం నుంచి గురువారం ఉదయం విమానంలో హైదరాబాద్‌ తరలించి వెంటనే మార్పిడి చేశారు. సేకరించిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేశామని హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ సందీప్‌ తెలిపారు. 12 మంది వైద్య నిపుణులు, అనుభవజ్ఞలైన నర్సింగ్‌ సిబ్బంది పాల్గొనట్లు వివరించారు. వైద్యులు విజిల్‌ రాహులన్‌, ప్రభాత్‌ దత్తా, శ్రీనివాస్‌ తదితరులు కీలకపాత్ర పోషించారన్నారు. సంక్లిష్టమైన ప్రక్రియను విజయవంతం చేసిన వీరందరినీ కిమ్స్‌ ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ అభినయ్‌ బొల్లినేని అభినందించారు. 

Updated Date - 2021-11-26T09:41:28+05:30 IST