లోక్‌సభకు 23వ పిల్లి అవసరమా?

ABN , First Publish Date - 2021-04-09T16:12:39+05:30 IST

అధికార పార్టీల ప్రజాకంటక పాలనపై..

లోక్‌సభకు 23వ పిల్లి అవసరమా?

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి


తిరుపతి, ఆంధ్రజ్యోతి: అధికార పార్టీల ప్రజాకంటక పాలనపై అంకుశంలా విరుచుకుపడతారు. అంశం ఏదైనా పూర్తి సమాచారం చేతిలో పెట్టుకుని డిబేట్లలో అవతలి వాళ్లకు చెమటలు పట్టిస్తారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌. పట్టాభిగా అందరికీ సుపరిచితుడైన ఈయన  ఉప ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో వారం రోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. పనుల ఒత్తిడిలో ఉన్న పట్టాభి ఆంధ్రజ్యోతితో ‘ఫటాఫట్‌’గా మాట్లాడారు.


లక్షల మెజారిటీ గురించి వైసీపీ అంచనాలపై మీ కామెంట్?

ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చిన తొలిరోజుల్లో ఒక మంత్రి 3 లక్షలు మెజారిటీ అన్నారు. మరో మంత్రి 5 లక్షలు అంటూ పెంచారు. సీఎం జగన్‌ రెడ్డి కటౌట్‌ చాలు తిరుపతిలో గెలిచిపోతామన్న ధీమా వ్యక్తం చేశారు. మరి అదంతా ఇప్పుడేమైంది? కటౌట్లను పక్కనపెట్టి జగన్‌ రెడ్డిని ప్రచారానికి పిలిపించుకుంటున్నారు. వైసీపీకి ఓటమి ఖాయమని ఇంటెలిజెన్స్‌ నివేదికలు ఇవ్వడంతోనే జగన్‌ రెడ్డి ప్రచారానికి వస్తున్నారు. 


స్థానిక సంస్థల ఎన్నికల ఊపు, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వైసీపీ భావిస్తోంది కదా?

స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిగాయో అందరం చూశాం. ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసి రౌడీయిజంతో గెలిచి, వాపును బలుపనుకుంటున్నారు. అవి నిజమైన ఎన్నికలుగా మేం పరిగణించడంలేదు. ఉప ఎన్నిక సీఈసీ పరిధిలో ఉంది. శాంతియుతంగా ఎన్నికలు జరిగితే మాత్రం వైసీపీ ఓటమి తథ్యం. 


తిరుపతిలో అభివృద్ది పనులన్నీ పెండింగ్‌లో ఉండడానికి కారణం?

తిరుపతిలోనే కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. రూ.లక్షల కోట్లు అప్పులు చేశారు. కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. మధ్యలో ఉన్నవాటిని పూర్తిచేసింది లేదు. అంతా తాడేపల్లి ప్యాలె్‌సలోని జగన్‌ రెడ్డి ఖజానాకు పోతోంది. 


పనబాక ప్రత్యేకత ఏమిటి?

రెండు సార్లు కేంద్రమంత్రిగా, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. వైసీపీ ఎంపీల వలే బానిసలుగా ఉండాల్సిన అవసరం  లేదు. మా యువనాయకుడు లోకేశ్‌ బాబు చెప్పినట్టు వైసీపీకి లోక్‌సభలో 22 పిల్లులు ఉంటే, టీడీపీకి 3 పులులు ఉన్నాయి.  మరో పిల్లిపిల్లను లోక్‌సభకు పంపాల్సిన అవసరం తిరుపతి ప్రజలకు లేదు.


తిరుపతి ప్రజా నాడి ఏవిధంగా ఉంది?

అరాచక పాలనతో తిరుపతి ప్రజలు విసిగిపోయారు. సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 


విజయమ్మను అభినవ గాంధారితో పోల్చాలని ఎందుకనిపించింది?

ఆమె కుమారుడు జగన్‌ రెడ్డి చేస్తున్న పాలనను కళ్లుండి కూడా చూడలేక పోతోంది. వివేకా హత్య కేసులో సమాధానాలు చెప్పలేని ప్రశ్నలున్నాయి. ఇవన్నీ  చూస్తున్నా ఆమె మాట్లాడలేక పోతోంది. అందుకే గాంధారిలా ఉండకుండా కళ్లకు కట్టిన గంతలు తీసి మాట్లాడమని చెప్పాను.


Updated Date - 2021-04-09T16:12:39+05:30 IST