ట్విటర్ బంపరాఫర్.. సత్తా ఉంటే లక్షల ప్రైజ్.. దగ్గర పడతున్న డెడ్‌లైన్

ABN , First Publish Date - 2021-08-04T00:19:38+05:30 IST

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్విటర్ ఒకటి. దీన్ని ఉపయోగించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉంటారు.

ట్విటర్ బంపరాఫర్.. సత్తా ఉంటే లక్షల ప్రైజ్.. దగ్గర పడతున్న డెడ్‌లైన్

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్విటర్ ఒకటి. దీన్ని ఉపయోగించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉంటారు. ఈ సంస్థ ఇప్పుడు తన యూజర్లకు ఒక పోటీ ఏర్పాటు చేసింది. దీనిలో గెలిస్తే భారీ బహుమతి ప్రకటించింది. ట్విటర్‌లో యూజర్ల డేటాకు సంబంధించి అందిస్తున్న సెక్యూరిటీపై ఛాలెంజ్‌ విసిరింది. ట్విటర్‌లో ఉన్న లోపాలను ఎవరైనా గుర్తిస్తే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది.


తమ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథంలో బగ్స్ ఏమైనా ఉన్నట్లు గుర్తిస్తే భారీ నగదు బహుమతి అందిస్తామని ట్విటర్‌ ప్రకటించింది.  బగ్‌ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే తొలిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ ‘డెఫ్‌ కాన్‌ ఏఐ’ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగబోతోంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ట్విటర్‌ వెల్లడించింది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనుక్కోవడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్‌ అని ట్విటర్ పేర్కొంది. దాన్ని స్వీకరించి లోపాలను పట్టిస్తే భారీ బహుమతి ఇస్తామని స్పష్టం చేసింది. 


కంపెనీకి చెందిన ముఖ్యమైన అల్గారిథం, ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథంలోని లోపాలను గుర్తించడం కోసం ఈ పోటీ నిర్వహిస్తామని మే నెలలోనే ట్విటర్ ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది. యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథంలో ఉన్న లోపాలను గుర్తిస్తేనే వాటిని పరిష్కరించడం సులభతరం అవుతుందని ట్విటర్‌ అంటోంది. అందుకే  యూజర్లను హ్యాకింగ్‌ నుంచి రక్షించడానికే ఈ పోటీ పెడుతున్నట్లు పేర్కొంది. 


పెద్ద పెద్ద కంపెనీలకు ఇలాంటి బగ్స్ పట్టించే ఎథికల్‌ హ్యాకర్లు, రీసెర్చ్‌ కమ్యూనిటీ డెవలపర్లకు ఈ పోటీ అద్భుతమైన అవకాశమని ట్విటర్‌ చెప్తోంది. ట్విటర్‌ బిగ్‌ బౌంటీ ప్రోగ్రాంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను ట్విటర్‌ ప్రకటించింది. ఆగస్టు 8న ‘డేఫ్‌ కాన్‌ ఏఐ’ విలేజ్‌లో ట్విటర్ హోస్ట్‌ చేయనున్న వర్క్‌ షాప్‌లో విజేతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే ఉత్సాహవంతులు 2021 ఆగస్టు 6 వరకూ పోటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మరెందుకాలస్యం టెకీలూ.. మీరు కూడా అదృష్టం పరీక్షించుకోండి. 

Updated Date - 2021-08-04T00:19:38+05:30 IST