టిక్‌టాక్ కహానీలో మరో ట్విస్ట్! కొత్త క్యారెక్టర్ ఎంట్రీ..

ABN , First Publish Date - 2020-08-09T18:44:41+05:30 IST

అమెరికాలో టిక్‌టాక్ కథ రోజుకో మలుపుతో రసవత్తరంగా నడుస్తోంది. ట్రంప్ నిషధాజ్ఞలు.. టిక్‌టాక్ కొనుగోలుకు కట్టుబడి ఉన్నామంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటనల నడుమ కొత్తగా ట్విటర్ పేరు తెరపైకి వచ్చింది.

టిక్‌టాక్ కహానీలో మరో ట్విస్ట్! కొత్త క్యారెక్టర్ ఎంట్రీ..

వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్ కథ రోజుకో మలుపుతో రసవత్తరంగా నడుస్తోంది. ట్రంప్ నిషధాజ్ఞలు.. టిక్‌టాక్ కొనుగోలుకు కట్టుబడి ఉన్నామంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటనల నడుమ కొత్తగా ట్విటర్ పేరు తెరపైకి వచ్చింది. అమెరికాలో వెలువడుతున్న కథనాల ప్రకారం.. ట్విటర్‌తో టిక్‌టాక్ ఈ విషయమై ప్రాథమిక స్థాయి చర్చలు కూడా జరుపుతోందట. అయితే ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 


మైక్రోసాఫ్ట్‌తో పోలిస్తే ట్విటర్ చిన్న సంస్థ కావడంతో ట్విటర్-టిక్‌టాక్ ఒప్పందానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవచ్చని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా సంస్థల మార్కెట్ ఆధిపత్యంపై ఇప్పటికే అమెరికాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయా కంపెనీలు అమెరికా చట్టసభసభ్యుల శల్య పరీక్షలను కూడా ఎదుర్కొంటున్నాయి. 


అయితే టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం అగ్రరాజ్యంలో వినిపిస్తోంది. గత కొద్ది వారాలు మాక్రోసాఫ్ట్ టిక్‌టాక్ చర్చలు నిరవధింకంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ట్విటర్‌ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్లు కాగా.. మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 1.6 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. రెండిటి మధ్య భూమ్యాకాశాల అంతరం ఉందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో ట్విటర్ టిక్‌టాక్‌ను హస్తగతం చేసుకోదలిస్తే..ఇందుకు కచ్చితంగా ఇతర మదుపర్ల అవసరం ఏర్పడుతుందనే అభిప్రాయం అధికంగా వినిపిస్తోంది. అయితే టిక్‌టాక్ మాత్రం ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ట్రంప్ టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని సదరు సంస్థ కోర్టు సవాలు చేసే యేచనలో ఉన్నట్టు సమాచారం. ట్రంప్ నిషేధాజ్ఞలు తమకు షాకిచ్చాయని, ఈ విషయంలో తమకు ఊరటనిచ్చే అన్ని దారులను పరిశీలిస్తున్నామని టిక్‌టాక్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో టిక్‌టాక్ భవితవ్యంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఇప్పట్లో తెరపడేలా కనిపించడ్లేదని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Updated Date - 2020-08-09T18:44:41+05:30 IST