Abn logo
Aug 14 2021 @ 14:24PM

రాహుల్ గాంధీ ట్విటర్ హ్యాండిల్ అన్‌లాక్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విటర్ శనివారం ఊరటనిచ్చింది. ఆయనతోపాటు ఆ పార్టీ నేతల  ట్విటర్ ఖాతాలను అన్‌లాక్ చేసింది. ఓ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులతో ఆయన కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసినందుకు దాదాపు 5 వేల ట్విటర్ ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫొటోను రాహుల్ గాంధీ వినియోగించుకునేందుకు అంగీకారం తెలపడంతో ట్విటర్ ఈ ఖాతాలను పునరుద్ధరించింది. 


ఢిల్లీలో తొమ్మిదేళ్ళ వయసుగల ఓ బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు కేసు నమోదైంది. ఆ బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించి, న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులతో తాను మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆగస్టు 4న ట్వీట్ చేశారు. ఈ విధంగా అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం చట్టవిరుద్ధమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సహా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ట్విటర్ చర్యలు తీసుకుంది. 


కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విపిన్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీకి చెందిన ఖాతాల్లో చాలా ఖాతాలు అన్‌లాక్ అయినట్లు తెలిపారు. కొందరు నేషనల్ కోఆర్డినేటర్ల ఖాతాలు ఇంకా లాక్‌లోనే ఉన్నాయన్నారు. తాము మొదటి రోజునే అంగీకార పత్రాన్ని సమర్పించామన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫొటోను రాహుల్ గాంధీ వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్లు ఓ లేఖను ట్విటర్‌కు సమర్పించినప్పటికీ, దానిని ట్విటర్ అనుమతించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఖాతాలపై నిషేధం విధించినందుకు తాము ట్విటర్‌పై పెద్ద ఎత్తున ఉద్యమం చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో ట్విటర్ ఆ లేఖను గుర్తించి, తమ ఖాతాలను అన్‌లాక్ చేసిందని చెప్పారు. 


అన్‌లాక్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన ట్విటర్ ఖాతాలో, ‘‘సత్యమేవ జయతే’’ అని ట్వీట్ చేశారు. 


ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, అభ్యంతరం వ్యక్తమైన ఫొటోను ఉపయోగించడానికి రాహుల్ గాంధీకి సంబంధిత వ్యక్తులు సమ్మతి తెలియజేస్తూ అధికారికంగా ఇచ్చిన లేఖ కాపీని ఆయన సమర్పించారని తెలిపారు. అపీలు ప్రక్రియలో భాగంగా ఇండియా గ్రీవియెన్స్ సెల్ ద్వారా దీనిని అందజేశారని తెలిపారు. ఆ ఫొటోలోని వ్యక్తులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేయడంతో ట్విటర్ తగిన చర్యలు తీసుకుందన్నారు. ఖాతాను పునరుద్ధరించామన్నారు. 


అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ కలిసి ఉన్న ఫొటోతో కూడిన ట్వీట్‌ భారత దేశంలో యూజర్లకు కనిపించదని చెప్పారు. ఆ ట్వీట్‌ భారత దేశంలో కనిపించదని తెలిపారు. 


ట్విటర్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ప్రభుత్వం చెప్పిన మాటలను వింటోందని రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. తనతోపాటు కాంగ్రెస్ నేతల ట్విటర్ ఖాతాలపై ఆంక్షలు విధించడం భారత దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.