Abn logo
Apr 20 2021 @ 07:04AM

రోల్డ్‌గోల్డ్‌ నగల చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : కల్లు కాంపౌండ్‌లో పరిచయమైన మహిళకు మరింత కల్లు తాగించి, ఆమె శరీరంపై ఉన్న నగలు(ఇమిటేషన్‌ గోల్డ్‌) దోచుకున్న ఇద్దరు నిందితులను మీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరం ప్రాంతానికి చెందిన తడకల సుజాత(30) అనే మహిళకు కల్లు తాగే అలవాటు. ఈ నెల 17న ఉదయం పని మీద బాలాపూర్‌ ప్రాంతానికి వచ్చి, అనంతరం సమీపంలోని ధాతునగర్‌ కల్లు కాంపౌండ్‌కు వెళ్లింది. అక్కడ కల్లు తాగుతుండగా, ఆమె ఒంటిపై ఉన్న నగలు గమనించిన బడంగ్‌పేట్‌ గాంధీనగర్‌కు చెందిన రాళ్లు కొట్టే సంపంగి చిన్నా(28), అతడి బావ మరిది వర్సు శ్రీను(21) వాటిని కాజేయాలని ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో ఆమెను మెల్లగా పరిచయం చేసుకుని, ఆమెకు మరింత కల్లు తాగించారు. 


అనంతరం ముగ్గురూ కలిసి ఒకే ఆటోలో బాలాపూర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ మూత్ర విసర్జన నిమిత్తం సుజాత సమీపంలోని పొదల్లోకి వెళ్లగా, నిందితులు చిన్నా, శ్రీను ఆమె వెనకాలే వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుని ఒంటిపై ఉన్న రెండున్నర తులాల రోల్డ్‌ గోల్డ్‌ మంగళసూత్రం, చెవి కమ్మలు, రెండు వేల నగదు తీసుకుని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మీర్‌పేట్‌ పోలీసులు విచారణ చేపట్టి, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గాంధీనగర్‌కు చెందిన చిన్నా, శ్రీనుగా గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ధాతునగర్‌ కల్లు కాంపౌండ్‌లో ఉన్న నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఇమిటేషన్‌ గోల్డ్‌ నగలతో పాటు రూ.రెండు వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు. నిందితుల్లో ఒకడైన చిన్నాపై గతంలో వంగూరు, కీసర, పహాడీషరీఫ్‌ పీఎ్‌సలలో కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement