చైనాకు మరో ఊహించని షాక్! పాత గాయం మానకమునుపే..

ABN , First Publish Date - 2021-07-28T20:47:59+05:30 IST

పాకిస్థాన్‌లో చైనాకు మరో షాక్ తగిలింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పాక్‌లో ఉంటున్న ఇద్దరు చైనీయులపై కాల్పులు జరిపి పారిపోయారు.

చైనాకు మరో ఊహించని షాక్! పాత గాయం మానకమునుపే..

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో చైనాకు మరో షాక్ తగిలింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పాక్‌లో ఉంటున్న ఇద్దరు చైనీయులపై కాల్పులు జరిపి పారిపోయారు. బుధవారం నాడు నిందితులు బైక్‌పై వచ్చి హఠాత్తుగా చైనీయులపై కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. బాధితులు ప్రస్తుతం కరాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు భద్రతా బలగాల రక్షణ లేకుండానే కరాచీ పారిశ్రామిక వాడకు వెళుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ దాడికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటివరకూ ఈ దాడికి బాధ్యత తీసుకోలేదు. మరోవైపు.. ఈ ఘటనపై చైనా స్పందించింది. పాక్ భద్రతావ్యవస్థపై తమకు నమ్మకముందని, పాకిస్థాన్‌లోని చైనీయులను, చైనా ఆస్తులను పాక్ రక్షించగలదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్ వ్యాఖ్యానించారు.


జులై 14న ఖైబర్ పాఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో  చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తొమ్మిది మంది అసువులు బాసారు. ఆ ఘటన మరువక మునుపే చైనీయులపై మరో దాడి జరగడంతో కలకలం రేగుతోంది. పాకిస్థాన్‌కు చైనా అత్యంత ముఖ్యమైన మిత్రదేశం.  దౌత్యపరంగానే కాకుండా ఆర్థిక, రక్షణ రంగాలోనూ చైనా, పాకిస్థాన్‌ మధ్య బలమైన బంధం ఉంది. పాక్ ప్రత్యేక భద్రతా దళాల రూపకల్పన, శిక్షణ, నిర్వహణ కోసం చైనా పెద్ద ఎత్తున ఆ దేశంలో నిధులు కుమ్మరించింది. ఈ దళాలలో మొత్తం 30 వేల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. 

Updated Date - 2021-07-28T20:47:59+05:30 IST