విశాఖ రాంకీ ఫార్మాలో విషవాయువు లీక్‌

ABN , First Publish Date - 2021-11-30T09:17:59+05:30 IST

విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ ఇంటర్మీడియట్‌ పంప్‌హౌ్‌స(ఐపీహెచ్‌)లో ఆదివారం రాత్రి విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పాయకరావుపేటకు చెందిన పెదిరెడ్డి మణికంఠ (22), తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురానికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్‌ (22) గాజువాక శ్రీనగర్‌లో..

విశాఖ రాంకీ ఫార్మాలో విషవాయువు లీక్‌

  • ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు బలి
  • పరిశ్రమ ఎదుట కుటుంబీకుల ఆందోళన
  • రూ.27 లక్షల చొప్పున పరిహారం


పరవాడ, నవంబరు 29: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ ఇంటర్మీడియట్‌ పంప్‌హౌ్‌స(ఐపీహెచ్‌)లో ఆదివారం రాత్రి విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పాయకరావుపేటకు చెందిన పెదిరెడ్డి మణికంఠ (22), తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురానికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్‌ (22) గాజువాక శ్రీనగర్‌లో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి రాంకీ ఐపీహెచ్‌లో సీ షిప్టు విధులకు హాజరయ్యారు. పంప్‌హౌస్‌ ఆన్‌ చేయడానికి తొలుత దుర్గాప్రసాద్‌, తర్వాత మణికంఠ లోపలకు వెళ్లారు. అయితే, అప్పటికే విషవాయువులు ఎక్కువ మోతాదులో వెలువడడంతో ఊపిరిరాడక అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే దుర్గాప్రసాద్‌ మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న మణికంఠను మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రాంకీ ఐపీహెచ్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అక్కడే బైఠాయించారు. చివరికి ఒక్కో కుటుంబానికి రూ.27 లక్షల నష్టపరిహారం, దహన ఖర్చుల నిమిత్తం రూ.50 వేల చొప్పున ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. కాగా, మణికంఠ నాలుగు నెలల నుంచి ఇక్కడ పనిచేస్తుండగా, దుర్గాప్రసాద్‌ 15 రోజుల క్రితమే చేరాడు. ఇద్దరూ శ్రీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకున్నారు. అతడికి మణికంఠ ఓ ఏడాది సీనియర్‌. ఇద్దరూ మంచి స్నేహితులు. కాగా, దుర్గా ప్రసాద్‌ తండ్రి లారీ డ్రైవర్‌ కాగా, మణికంఠ తండ్రి జీడిపిక్కల వ్యాపారం చేస్తుంటారు. చేతికి అందొచ్చిన కొడుకులు అర్ధంతరంగా దూరం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Updated Date - 2021-11-30T09:17:59+05:30 IST