కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-04-03T10:11:16+05:30 IST

ఇందుకూరుపేట మండలంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో హైరిస్క్‌ జోన్‌గా ప్రకటించారు.

కరోనా కలవరం

 కావలి నియోజకవర్గంలో నాలుగు పాజిటివ్‌కేసుల నమోదు

    కోవూరులో రెండు..


ఇందుకూరుపేట, ఏప్రిల్‌ 2 : ఇందుకూరుపేట మండలంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో హైరిస్క్‌ జోన్‌గా ప్రకటించారు.  బియ్యం వ్యాపారి,  ప్లంబర్‌ ఢిల్లీ మత ప్రార్థనలకు గత నెల 12వ తేదీన వెళ్లి 17న గ్రామాలకు  వచ్చారు. 18 నుంచి పది రోజులపాటు మండలంలోని పలు గ్రామాల్లో కొందరు ఇళ్లలోనూ, మసీదుల్లోనూ మత ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బంధు మిత్రులను కూడా కలుసుకున్నారు. వారి రాక  గతనెల 28వతేదీ వెలుగు చూడడంతో వారికి హడావిడిగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారి శాంపిల్స్‌ను తిరుపతికి పంపారు. అక్కడ నుంచి వచ్చిన రిపోర్టును మరోసారి నిర్థారణ చేసుకోవడానికి పుణెకి పంపారు. గురువారం ఉదయం ఆ ఇద్దరికి పాజిటివ్‌ అని  రిపోర్టు వచ్చింది.  దీంతో అధికారులు ఉదయం మూడు కిలోమీటర్లు పరిధిలో హై రిస్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లోకి ఎవరూ రాకూడదని, ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. పాలు, పండ్లు, నిత్యావసర వస్తువులన్నీ వలంటీర్లు గ్రామ సచివాలయ, వీఆర్వోలు ఇళ్లకే  అందజేస్తారని తెలిపారు. 


24 మంది కుటుంబ సభ్యుల తరలింపు

ఆ ఇద్దరికి చెందిన 24 మంది కుటుంబ సభ్యులను గురువారం జీజీహెచ్‌కు తరలించారు.  వారు ఈ పది రోజులపాటు ఏఏ గ్రామాల్లో తిరిగారు, ఏ షాపులు, ఇళ్లకు వెళ్లారనే అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  సీఐ రామకృష్ణ, ఎంపీడీవో రఫీఖాన్‌, ఎస్‌ఐ నరేష్‌, పోలీసు అధికారులు, సిబ్బంది అధికారులు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు గ్రామంలో పర్యటించి కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన  కల్పించారు.


కావలి : ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తుఫాన్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్‌ వచ్చిందని గురువారం రిపోర్టు రావడంతో  కావలి కలవరపడింది. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని రెడ్‌ అలర్ట్‌గా ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు ఆ ప్రాంతంలో పారిశుధ్యకార్యక్రమాలు చేపట్టారు. 


ఆ వ్యక్తి  సంబంధాలపై ఆరా

కరోనా పాజిటీవ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరినీ అధికారులు నెల్లూరుకు వైద్య పరీక్షలకు తరలించారు.  పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాక తిరిగిన ప్రాంతాలు, కలిసిన వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనకు సబ్‌కోర్టు సందులో స్టౌలు రిపేర్లుచేసే దుకాణం ఉంది. ఆయన వద్దకు ఎవరెవరు వచ్చి స్టౌలు రిపేర్లు చేయించుకున్నారో సమాచారం సేకరిస్తున్నారు. ఆయన ఇంటికి చుట్టుపక్కల వారు చాలా మంది  వెళ్లినట్లు తెలుస్తుండటంతో వారి వివరాలను  రాబడుతున్నారు.


రెండు డాక్టర్‌ కుటుంబాలపై ఆగని వదంతులు

ఇతరదేశాల నుంచి వచ్చిన డాక్టర్‌ పిల్లలపై వదంతులు రావడంతో గురువారం ఆ డాక్టర్‌ తమ పిల్లలతో సబ్‌ కలెక్టర్‌ను కలసి తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పారు. అలాగే  ఒంగోలులో చర్చికి  వెళ్లి వచ్చిన మరో డాక్టర్‌ కుటుంబ సభ్యుల్లో పాజిటీవ్‌ కేసు ఉందనే ప్రచారం రావడంతో ఆ డాక్టర్‌ కుటుంబ సభ్యులు వెళ్లలేదని చెబుతున్నారు. అధికారులు కూడా  అదే మాట చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగలేదు.


అల్లూరు :  మండంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దారు కాయల సతీ్‌షకుమార్‌ గురువారం తెలిపారు. ఆ రెండు గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో వారు ఉన్నారు. దాంతో గ్రామాల్లో ఇతర గ్రామస్థులను రానీయకుండా కంపను అడ్డుగా వేస్తున్నారు. 


4 కరోనా పాజిటీవ్‌ కేసుల నమోదు: సబ్‌కలెక్టర్‌

కావలి : కావలి నియోజకవర్గంలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినందున ఆ ప్రాంతాలను రెడ్‌ అలర్ట్‌గా ప్రకటించినట్లు కావలి సబ్‌కలెక్టర్‌ సీహెచ్‌. శ్రీధర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన తన చాంబరులో విలేకరులతో మాట్లాడుతూ కావలిలో ఒకటి, అల్లూరు మండలంలో రెండు, బోగోలు మండలంలో ఒకటి  కరోనా పాజిటివ్‌ వచ్చాయన్నారు. వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించామన్నారు. వారితో మాట్లాడిన వారందరినీ కూడా ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు చెప్పారు.


పోతిరెడ్డిపాలెంలో రెడ్‌జోన్‌

కోవూరు : మండలంలోని ఒక వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందనే సమాచారంతో అధికారులు ఆగ్రామంలోకి ఎవరినీ అనుమతించకుండా 3కిలో మీటర్ల వరకు రెడ్‌ జోన్‌ ప్రకటించారు. ఆ గ్రామ సమీప పరిసర ప్రాంతాల్లో అఽధికారులు జనసంచారం లేకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. కోవూరులో మరింత పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. 


 దారులు మూసివేత

బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని ఒక గ్రామంలో పాజిటివ్‌ నిర్థారణ కావడంతో గురువారం ఆ గ్రామ, పరిసర గ్రామాల్లో దారులన్నింటినీ స్థానిక ప్రజలు ముళ్లకంచెలు, తాటిమాన్లు, పలు వాహనాలను అడ్డంగా పెట్టి మూసేశారు. బుధవారం నుంచే ఆ గ్రామ పంచాయతీని హైరిస్క్‌ జోన్‌గా ప్రకిటించడంతో పోలీసు బందోబస్తుతోపాటు రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆ గ్రామాల్లోని ప్రజలకు రేషన్‌ సరుకులు కూడా ఇంటింటికీ సివిల్‌సప్లైస్‌ అధికారులు, వీఆర్వోలు, డీలర్లు స్వయంగా ఇళ్లకే వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు.


కొడవలూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు, పోలీసు లు మండలంలోని నార్తురాజుపాలెం , కొడవలూరు తదితర గ్రామాల్లో జన సంచారం లేకుండా చేశారు. ఎస్‌ఐ వీర ప్రతాప్‌ ప్రత్యేక చర్యలు తీసూకున్నారు. దీంతో  వీధులన్నీ  నిర్మానుష్యంగా కనిపించాయి. 


Updated Date - 2020-04-03T10:11:16+05:30 IST