ఇద్దరు కూతుళ్లపై మూడేళ్లుగా లైంగికదాడి

ABN , First Publish Date - 2021-01-20T08:08:42+05:30 IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కర్కోటకుడయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లపై ఒకరికి తెలియకుండా మరొకరిపై మూడేళ్లుగా లైంగికదాడికి

ఇద్దరు కూతుళ్లపై మూడేళ్లుగా లైంగికదాడి

ఓ తండ్రి ఘోరం.. బంజారాహిల్స్‌లో ఘటన


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, (ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కర్కోటకుడయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లపై ఒకరికి తెలియకుండా మరొకరిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ వారిని బెదిరించాడు. తండ్రి దాష్టీకాన్ని భరించలేక ఓ బాలిక ఇంట్లోంచి పారిపోవడంతో ఈ ఘోరం బయటపడింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12, ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే బాలిక (16) గతనెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కూతురు కనిపించడం లేదంటూ కార్మికుడిగా పని చేసే బాలిక తండ్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 6న బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. స్థానికంగా నివసించే ఓ యువకుడే ఆమెను తీసుకెళ్లినట్లు విచారణలో తెలుసుకొని అతడిపై కేసు నమోదు చేశారు. కాగా ఇంట్లోంచి ఎందుకు బయటకు వెళ్లావంటూ బాలికపై ఆమె సోదరి (18) ఆగ్రహం వ్యక్తం చేయడంతో తనపట్ల తండ్రి చేస్తున్న ఘోరాలను చెప్పుకొని భోరుమంది.


తనను తండ్రి రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగాడని, ఆ బాధ భరించలేకే తాను ఇల్లు వదిలి  వెళ్లిపోయానంటూ విలపించింది. చెల్లెలి మాటలకు తల్లడిల్లిన ఆ సోదరి కూడా కన్నీళ్ల పర్యంతమైంది. తండ్రి తనను కూడా మూడేళ్లుగా చిత్రహింసలకు గురి చేస్తూ లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ విలపించింది. అనంతరం అక్కాచెల్లెళ్లు ధైర్యం చేసి, తమపై జరుగుతున్న లైంగికదాడికి సంబంధించి తండ్రిపై ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడైన వారి తండ్రిపై సెక్షన్‌ 376(2)(ఎఫ్‌)(ఎన్‌), 376 (3), 506లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-20T08:08:42+05:30 IST