కూటి కోసం కూలికెళితే.. బావి రూపంలో ఇద్దరిని కబళించిన మృత్యువు

ABN , First Publish Date - 2020-09-19T16:09:43+05:30 IST

కూటి కోసం కూలికెళితే బావి రూపంలో మృత్యువు వెంటాడింది. కరోనా కారణంగా పనుల్లేక అల్లాడుతున్న కష్టకాలంలో పురాతన బావి పూడ్చివేత పని దొరకింది. సంతోషంగా ఆ పనికి వెళ్లిన ఎనిమిది మంది కూలీల్లో ఇరువురు మృత్యువాత పడటం

కూటి కోసం కూలికెళితే.. బావి రూపంలో ఇద్దరిని కబళించిన మృత్యువు

నూజివీడు మండలం పోలసానపల్లిలో విషాదం


నూజివీడు రూరల్‌ / హనుమాన్‌జంక్షన్‌: కూటి కోసం కూలికెళితే బావి రూపంలో మృత్యువు వెంటాడింది. కరోనా కారణంగా పనుల్లేక అల్లాడుతున్న కష్టకాలంలో పురాతన బావి పూడ్చివేత పని దొరకింది. సంతోషంగా ఆ పనికి వెళ్లిన ఎనిమిది మంది కూలీల్లో ఇరువురు మృత్యువాత పడటం నూజివీడు మండలం పోలసానపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ పరిధిలో ఒక వ్యవసాయ బావి పూడ్చివేతకు ఆ గ్రామ రైతు ఆంజనేయులు పోలసానిపల్లికి చెందిన కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కట్టుడు రాళ్లతో ఉన్న బావిని అలాగే పూడ్చివేస్తే అరిష్టమనే సెంటిమెట్‌ కారణంగా రాళ్లను తొలగించి పూడ్చాలని భావించారు. దీంతో కూలీల్లో అచ్చి తిరుపతిరావు (55), అచ్చి రమేష్‌ (40) బావిలోకి దిగారు. 


రాళ్లను తొలగించే సమయంలో ఇటీవల వర్షాలకు నాని ఉన్న బావి ఒడ్డు ఒక్కసారిగా విరిగిపడింది. తిరుపతిరావు, రమేష్‌ ఇద్దరూ బావిలోనే రాళ్లు, మట్టి పెళ్లల నడుమ చిక్కుకుపోయారు. తోటి కూలీలు వారిని బయటకు తీసినా, అప్పటికే ఇద్దరూ మృతి చెందడం అందరి హృదయాలనూ కలచివేసింది. సంఘటనా స్థలం నుంచి వీరి మృతదేహాలను స్వగ్రామం పోలసానపల్లికి తరలించారు. చాలా నెలల తరువాత పని దొరికిందన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబసభ్యులు తమవాళ్లు విగతజీవులుగా తిరిగిరావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. 

Updated Date - 2020-09-19T16:09:43+05:30 IST