మానవసహిత గగన్‌యాన్.. రష్యాకు భారత ఫ్లైట్ సర్జన్లు!

ABN , First Publish Date - 2021-01-11T01:13:47+05:30 IST

మానవసహిత గగన్‌యాన్ మిషన్‌కు ఇస్రో రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఫ్లైట్ సర్జన్లను శిక్షణ

మానవసహిత గగన్‌యాన్.. రష్యాకు భారత ఫ్లైట్ సర్జన్లు!

న్యూఢిల్లీ: మానవసహిత గగన్‌యాన్ మిషన్‌కు ఇస్రో రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఫ్లైట్ సర్జన్లను శిక్షణ కోసం త్వరలో రష్యా పంపించనుంది. భారత వాయుసేనకు చెందిన ఈ వైద్యులు ఏరోస్పేస్ మెడిసిన్‌లో నిపుణులు. ఫ్లైట్ సర్జన్లు ఇద్దరు త్వరలో రష్యా వెళ్లి అక్కడి ఫ్లైట్ సర్జన్ల వద్ద శిక్షణ తీసుకుంటారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 


మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో వ్యోమగాముల శిక్షణ ఎంతో కీలకం. ప్రయోగ సమయంలోనూ, ఆ తర్వాత వ్యోమగాముల ఆరోగ్యానికి సంబంధించి ఫ్లైట్ సర్జన్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబోయే వ్యోమగాములతో కలిసి వీరు కూడా శిక్షణ తీసుకుంటారని అధికారి పేర్కొన్నారు. 


భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కోసం భారత వాయసేనకు చెందిన నలుగురు టెస్టు పైలట్లను ఎంచుకున్నారు. వీరంతా గతేడాది ఫిబ్రవరి నుంచి మాస్కో సమీపంలోని యూరీ గగారిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. నిజానికి వారు ఈ మార్చిలో దేశానికి తిరిగి రావాల్సి ఉండగా, రష్యాలో కరోనా లాక్‌డౌన్ కారణంగా శిక్షణకు అంతరాయం ఏర్పడింది. 


ఫ్లైట్ సర్జన్లు శిక్షణ కోసం ఫ్రాన్స్‌ కూడా వెళ్లనున్నట్టు ఆ అధికారి తెలిపారు. ఫ్రెంచ్‌లో శిక్షణ మరింత సహజ సైద్ధాంతికంగా ఉంటుంటుందని ఆయన పేర్కొన్నారు. ఫిజీషియన్లు, ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చేందుకు 2018లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్ సర్జన్ బ్రిగిట్ గోడార్డ్ భారత్‌ వచ్చారు.


స్పేస్ మెడిసన్‌లో ఫ్రాన్స్ వద్ద పూర్తిస్థాయి మెకానిజం ఉంది. దానివద్ద మెడెస్ స్పేస్ క్లినిక్ కూడా ఉంది. ఇది నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్ (సీఎన్‌సీఎస్)కు అనుబంధం. స్పేస్ సర్జన్లకు ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపనున్నారు. 

Updated Date - 2021-01-11T01:13:47+05:30 IST