భారత సంతతి జర్నలిస్ట్‌లకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2021-06-12T21:17:06+05:30 IST

భారత సంతతికి చెందిన ఇద్దరు జర్నలిస్ట్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పుసర్కాల్లో ఒకటైన పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. వీగర్ ముస్లింలపట్ల చైనా ప్రభుత్వం క్రూ

భారత సంతతి జర్నలిస్ట్‌లకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపిక

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఇద్దరు జర్నలిస్ట్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పుసర్కాల్లో ఒకటైన పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. వీగర్ ముస్లింలపట్ల చైనా ప్రభుత్వం క్రూరంగా ప్రవరిస్తోంది. కాగా.. వీగర్ ముస్లింలను బంధించేందుకు చైనా ప్రభుత్వం జిన్‌జియాంగ్ ప్రాంతంలో నిర్భంద కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నిర్భంధ కేంద్రాలకు సంబంధించిన ఫొటోలను శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి.. భారత సంతతికి చెందిన మేఘనా రాజగోపాలన్ తన సహోద్యోగులతో కలిసి బహిర్గతం చేశారు. ఈ క్రమంలో బజ్‌ఫీడ్ న్యూస్‌కు చెందిన మేఘనా రాజగోపాలన్, అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్‌చెక్.. ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. 



భారత సంతతికి చెందిన నీల్ బేడి అనే జర్నలిస్ట్‌కు కూడా లోకల్ రిపోర్టింగ్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫ్లోరిడాకు చెందిన ఓ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై నీల్ బేడి పరిశోధాత్మక కథనాలు రాశారు. ఈ నేపథ్యంలో నీల్ బేడి.. పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటిగా పులిట్జర్‌ ప్రైజ్‌లను కూడా భావిస్తుంటారు. ఈ పురస్కారాలను గెలుచుకున్న వారికి సమాజంలో గౌరవం కూడా అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది. జోసెఫ్ పులిట్జర్ అనే వార్తాపత్రిక ప్రచురనకర్త రాసుకున్న వీలునామా వల్ల ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది మొదలయింది. ఆయన 1911వ సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖున మరణించాడు. ఆయన మరణించిన తర్వాతే ఈ వీలునామా బయటపడింది. ‘కొలంబియా యూనివర్శిటీలో ఓ జర్నలిజం స్కూలును ప్రారంభించాలన్నది నా అభిలాష. జర్నలిజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ‘పులిట్జర్ ప్రైజ్’ పేరుతో అవార్డులు ఇచ్చి సత్కరించండి. అందుకుగానూ నా ఆస్తిలో రెండు లక్షల 50వేల డాలర్ల రూపాయలను కేటాయిస్తున్నాను’ అంటూ తన వీలునామాలో పులిట్జర్ పేర్కొన్నాడు. దాదాపు 110 ఏళ్ల క్రితం జరిగిందీ ఈ ఘటన. 


జోసెఫ్ పులిట్జర్ మరణానంతరం మొదటిసారిగా 1917వ సంవత్సరం జూన్ 4వ తారీఖున పులిట్జర్ బహుమతులను ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి యేటా 21 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. అవార్డును గెలుచుకున్న వారికి 15వేల డాలర్ల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో అవార్డులను గెలుచుకున్న వారిని మాత్రం గోల్డ్ మెడల్‌తో సత్కరిస్తారు.


Updated Date - 2021-06-12T21:17:06+05:30 IST