ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-01-18T05:41:33+05:30 IST

ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తులాల బంగారం, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- మూడు తులాల బంగారం, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, జనవరి 17: ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు  అరెస్టు చేశారు.  వారి నుంచి  మూడు తులాల బంగారం, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివరాలు వెల్లడించారు. బోయినపల్లి మండలంలోని రామన్నపేటకు చెందిన దర్శనాల రాజశేఖర్‌ (29), చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన మల్యాల రంజిత్‌ (28)    సిరిసిల్ల పట్టణంలోని వెంకటేశ్వర వీధిలోని జ్యూవెలరీ షాప్‌ల వద్ద సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.  విచారించగా ఇటీవల చైన్‌స్నాచింగ్‌లో దొంగిలించిన బంగారం విక్రయించేందుకు సిరిసిల్లకు వచ్చినట్లు తేలింది.  మరింత లోతుగా విచారించగా ద్విచక్రవాహనాలు కూడా దొంగిలించినట్లు బయటపడింది.  సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి వద్ద పార్క్‌చేసిన ఆర్‌15, ములుగులోని బ్యాంకు వద్ద ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను ఎత్తుకొచ్చారు. గతేడాది అక్టోబరు 28న జిల్లెల్ల  ఎక్స్‌ రోడ్‌ వద్ద కిరాణ షాప్‌లో ఉన్న మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. ఆ తర్వాత వీరు ఈ నెల 14న సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట వద్ద  కిరాణ షాప్‌లో ఉన్న ఎల్లంకి పుష్పలత మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించేందుకు యత్నించారు. ఆమె కేకలు వేయడంతో వదిలివేసి పరారయ్యారు. జిల్లెల్లలో దొంగిలించిన పుస్తెల తాడును సిరిసిల్లలోని జ్యూవెలరీ షాప్‌లో విక్రయించేందుకు రాగా   ఇద్దరిని అరెస్టు చేసినట్లు,  దొంగిలించిన రెండు ద్విచక్రవాహనాలతోపాటు వారి నుంచి మరో రెండు ద్విచక్రవాహనాలను మూడు తులాల పుస్తెలతాడును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.  ఈ ఇద్దరు దొంగలు మూఠాగా ఏర్పడి పలు రకాల దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడ్డారని ఎస్పీ వెల్లడించారు.  సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య , డీఎస్పీ చంద్రకాంత్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:41:33+05:30 IST