టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ.. ఒకే కారులో ఇద్దరు మంత్రులు.. ఇక విబేధాలు లేనట్టేనా..?

ABN , First Publish Date - 2020-05-21T18:23:25+05:30 IST

గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఒకే వేదికను పంచుకోవడానికి కూడా విముఖత చూపే మంత్రులిద్దరు ఒకే వాహనంలో కలిసి ప్రయాణించడం జిల్లాలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ మధ్య సయోధ్య కుదిరిందా... విభేదాలు సర్దుకున్నాయా...

టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ.. ఒకే కారులో ఇద్దరు మంత్రులు.. ఇక విబేధాలు లేనట్టేనా..?

అమాత్యుల మధ్య సయోధ్య కుదిరిందా..

ఒకే వాహనంలో గంగుల, ఈటల ప్రయాణం 

తోడుగా ముగ్గురు ఎమ్మెల్యేలు

టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఒకే వేదికను పంచుకోవడానికి కూడా విముఖత చూపే మంత్రులిద్దరు ఒకే వాహనంలో కలిసి ప్రయాణించడం జిల్లాలో ఆసక్తికర చర్చకు తెరతీసింది.  మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ మధ్య సయోధ్య కుదిరిందా... విభేదాలు సర్దుకున్నాయా... అధినేత వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారా... లేక వారే సర్దుబాటు చేసుకున్నారా అంటూ టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమ లాకర్‌ గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన తర్వాత కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. మంత్రులుగా ఒకే వేదిక మీద కలిసి పాల్గొన్న సందర్భాలు కూడా తక్కువే. ఏమైందో ఏమో కానీ మంత్రులిద్దరు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఒకే వాహనంలో ప్రయాణించడం అటు పార్టీవర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. అందరిలోనూ ఆసక్తి రేపింది. 


సరదాగా.. జోకులు వేస్తూ..

బుధవారం కలెక్టరేట్‌లో నియంత్రిత వ్యవసాయ విధానంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం జరుగగా మంత్రులిద్దరు ఆ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక రోడ్లు, భవనాలశాఖ వసతి గృహం నుంచి మంత్రి గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, వొడితెల సతీష్‌బాబు ఒకే వాహనంలో కలెక్టరేట్‌కు బయలు దేరారు. మంత్రి గంగుల కమలాకర్‌ తన వాహనాన్ని స్వయంగా డ్రైవ్‌ చేయగా ఈటెలతోపాటు ఎమ్మెల్యేలు కూడా అదే వాహనంలో కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ దృశ్యం అధికారులను కూడా ఆశ్చర్యశక్తులను చేసింది. మంత్రులిద్దరు విబేధాలు వీడి ఒకే వాహనంలో కలిసి రావడం తమకు కూడా శుభపరిణామమేనని వాఖ్యానించినట్లు తెలిసింది. మంత్రులు ఒకే వాహనంలో ప్రయాణించిన సందర్భంలో ఎమ్మెల్యేలు సరదాగా జోకులు వేసుకున్నారని తెలిసింది. వాహనాన్ని డ్రైవ్‌ చేస్తున్న మంత్రి గంగులనుద్దేశించి వెనుక కూర్చొన్న ఎమ్మెల్యేలు స్టీరింగ్‌ సరిగా తిప్పు అన్నా ... అని అనగా మన బాస్‌ ట్రైనింగ్‌ ఇచ్చినట్లు నడుపుతున్నా... గమ్యానికి సురక్షితంగానే చేరుతామంటూ గంగుల బదులిచ్చినట్లు తెలిసింది. 


నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు

ఇదే సందర్భంలో లాక్‌డౌన్‌ నిబంధనలను మంత్రులు బేఖాతరు చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. జిల్లా రాజకీయాలలో ఆసక్తికర చర్చకు తెరతీసిన ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మంత్రులు ఇద్దరు ఒకే వాహనంలో ముందు సీట్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చొన్నా, వెనుక సీటులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరిపక్కన ఒకరు కూర్చోవలసి రావడంతో భౌతిక దూరం పాటించే అవకాశమే లేకుండా పోయింది. లాక్‌డౌన్‌-4 నిబంధనల ప్రకారంగా కారులలో నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉండగా స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే దానిని పట్టించుకోలేదనే పలువురు తప్పుబట్టారు.  

Updated Date - 2020-05-21T18:23:25+05:30 IST