జిల్లాకు మరో రెండు కార్పొరేషన్‌ పదవులు

ABN , First Publish Date - 2022-01-20T05:16:19+05:30 IST

జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి. వారం రోజుల్లోగానే వీరి నియామకాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జిల్లాకు మరో రెండు కార్పొరేషన్‌ పదవులు

 - అదృష్టవంతుల జాబితాలో రవీందర్‌సింగ్‌, గెల్లు శ్రీనివాస్‌

- వారం రోజుల్లో నియామక ఉత్తర్వులు

- ముఖ్యమంత్రి ఆదేశంతో జరుగుతున్న ఏర్పాట్లు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి. వారం రోజుల్లోగానే వీరి నియామకాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకొని అధికారిక ప్రక్రియకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. మాజీ మంత్రి, ప్రస్తుత  బీజేపీ నేత, హుజూరాబాద్‌ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌పై గత ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. నియోజకవర్గ ఇన్‌చార్జీగా శ్రీనివాస్‌ యాదవ్‌ వచ్చే ఎన్నికల వరకు పనిచేసి సాధారణ ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అవుతాడని అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రి ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టాలని నిర్ణయించడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి కాబోయే అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి అని తేల్చి చెప్పినట్లు భావిస్తున్నారు. కౌశిక్‌రెడ్డి ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతాడని భావించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

అలాగే కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌కు కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి లభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 232 ఓట్లను సాధించారు. ఆ వెనువెంటనే ఆయన పక్షం గడవకముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు ప్రగతిభవన్‌కు వెళ్లి కలిసి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. అప్పటి నుంచే ఆయనకు కార్పొరేషన్‌ పదవి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో పర్యటించిన రెండు సందర్భా లలో రవీందర్‌సింగ్‌కు రాష్ట్రస్థాయిలో మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని పార్టీవర్గాలు భావించాయి. పార్టీలో మొదటి నుంచి అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న రవీందర్‌సింగ్‌ పార్టీని కాదని వెళ్లినా మళ్లీ పిలిచి పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం కార్యకర్తలకు పెద్దపీట వేయడమేనని అనుకుంటున్నారు. జనవరి మొదటి వారంలోనే ఆరు కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో సంక్రాంతి వరకు పీడ రోజులుగా భావించే ఆనవాయితీ ఉన్నందున ఇప్పుడు మళ్లీ పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారని చెబుతున్నారు. వారం రోజుల్లోగా ఆరు కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటిస్తారని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఆమోదంతో ఫైల్స్‌ జీఏడీకి వెళ్లినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. 


Updated Date - 2022-01-20T05:16:19+05:30 IST