Abn logo
Sep 20 2021 @ 01:00AM

Vishakapatnam: ‘రేసు’లో మరో ఇద్దరు!?

జీకే వీధి జడ్పీటీసీ శివరత్నం పేరును ఇప్పటికే ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం

వ్యతిరేకిస్తున్న గిరిజన ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు

ముంచంగిపట్టు సభ్యురాలు సుభద్ర పేరు సూచిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

జి.మాడుగుల జడ్పీటీసీ వెంకటలక్ష్మి సైతం ప్రయత్నాలు

వైస్‌ చైర్మన్‌ పదవులకు పలువురి పోటీ

ప్రచారంలో పరవాడ జడ్పీటీసీ సభ్యుడు సన్యాసిరాజు, అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ, భీమిలి జడ్పీటీసీ సభ్యుడు సుంకరి గిరిబాబు పేర్లు 

25న ఎన్నికలు


విశాఖపట్నం/పాడేరు(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి వైసీపీ అధిష్ఠానం గూడెంకొత్తవీధి జడ్పీటీసీ సభ్యురాలు కిముడు శివరత్నం పేరును ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుండగా, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శివరత్నం భర్త విశ్వేశ్వరరాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, అటువంటి వారికి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరి పేర్లు తెర పైకి వచ్చాయి. వీరిలో ఒకరికి ఏజెన్సీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలు వున్నాయని సమాచారం.


విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. అత్యధిక జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ...జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని జేకే వీధి నుంచి గెలుపొందిన కిముడు శివరత్నానికి కట్టబెట్టడానికి మొగ్గు చూపుతోంది. ఆమె భర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు గతంలో వైసీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. కానీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తానని అధినేత జగన్‌ హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వేశ్వరరాజు తమకు వ్యతిరేకంగా పనిచేశారంటూ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు కూడా తన కుమార్తె వెంకటలక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ అధినేత జగన్‌తోపాటు పలువురు పార్టీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు.


ఈ నేపథ్యంలో జి.మాడుగుల జడ్పీటీసీ అభ్యర్థిగా బాలరాజు కుమార్తెను ఎంపిక చేయొద్దని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పినప్పటికీ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఆమె వ్యతిరేకిస్తున్న మత్స్యరాస విశ్వేశ్వరరాజు భార్య శివరత్నానికి, మత్స్యరాస బాలరాజు కుమార్తె వెంకటలక్ష్మికి జీకే వీధి, జి.మాడుగుల జడ్పీటీసీ స్థానాలు కేటాయించింది. ఎన్నికల్లో వీరిద్దరితోపాటు మరో నాలుగు స్థానాల్లో కూడా ఎస్టీ మహిళలు (వైసీపీ) గెలుపొందారు. వైసీపీ అధినేత జగన్‌ గతంలో విశ్వేశ్వరరాజుకు ఇచ్చిన హామీ మేరకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి ఆయన భార్యను ఎంపిక చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన ప్రాంతానికి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయంగా ముంచంగిపుట్టు జడ్పీటీసీగా గెలిచిన సుభద్ర పేరును ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెరపైకి తెచ్చినట్టు  చెబుతున్నారు.


ఇదే సమయంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు కూడా పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని జి.మాడుగుల జడ్పీటీసీగా గెలిచిన తన కుమార్తె వెంకటలక్ష్మిని జడ్పీ చైర్‌పర్సన్‌ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు ఇచ్చిన హామీని అధిష్ఠానం నిలుపుకుంటుందా?, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాటకు విలువ ఇస్తుందా?, మాజీ మంత్రి ఎం.బాలరాజు ప్రయత్నాలు సఫలం అవుతాయా? అన్న సందేహాలకు ఒకటి, రెండు రోజుల్లో తెరపడుతుందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు.


వైస్‌చైర్మన్‌ పదవులకు నలుగురి పేర్లు!

కాగా జడ్పీకి రెండు వైస్‌ చైర్మన్‌ పోస్టులు ఉన్నాయి. చైర్‌పర్సన్‌ పదవి ఏజెన్సీకి చెందిన ఎస్టీ మహిళకు కేటాయించడంతో వైస్‌ చైర్మన్‌ పదవులకు మైదాన ప్రాంతానికి చెందిన వారిని ఎంపిక చేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు, అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ (ఎమ్మెల్యే ముత్యాలనాయుడు కుమార్తె), భీమిలి జడ్పీటీసీ సభ్యుడు సుంకరి గిరిబాబు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వైస్‌ చైర్మన్‌ పదవుల విషయంలో అధిష్ఠానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


25న జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక.. 24న మండల పరిషత్‌ అధ్యక్షులు...

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపీపీ పదవులకు సోమవారం, జడ్పీ పదవికి మంగళవారం నోటీస్‌ జారీచేస్తారు. ఎంపీపీ పదవితోపాటు వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ పదవులకు ఈ నెల 24వ తేదీన నామినేషన్లు స్వీకరించి, అదేరోజు ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం నిర్వహిస్తారు. ఇక జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్లు, రెండు కో-ఆప్షన్‌ పదవులకు ఈ నెల 21న నోటీస్‌ జారీచేస్తారు.  25వ తేదీన అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్లు, ఇతర సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.