ఇసుక మాఫియాకు మరో ఇద్దరు బలి

ABN , First Publish Date - 2020-08-02T08:52:20+05:30 IST

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌లో ఓ రైతును లారీతో తొక్కించిన ఘటనకు ముందే అదే

ఇసుక మాఫియాకు మరో ఇద్దరు బలి

  •  మూడు నెలల క్రితం ఘటన

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 1: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌లో ఓ రైతును లారీతో తొక్కించిన ఘటనకు ముందే అదే జిల్లాలో ఇసుక మాఫియా మరో దారుణానికి ఇద్దరు బలయ్యారు. 3 నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మృతుల కుటుంబీకుల వివరాల ప్రకారం..  జిల్లాలోని మూసాపేట గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌, సోహైల్‌ మాలిక్‌.. మే నెల 3న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొమ్మిరెడ్డిపల్లి నుంచి ఇసుక లోడ్‌తో దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మూసాపేట పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు కేసు నమోదు చేశారు. విచారణ చేయకుండా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.


మృతుల కుటుంబసభ్యు లు పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ‘నేను సైతం’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, న్యాయవాది ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించారు. ఆయన డీజీపీ, ఎస్పీలకు జూలై 23న ఫిర్యాదు చేశారు. కేసును పునర్విచారణ చేపట్టాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన ఎస్పీ రెమా రాజేశ్వరి తన బృందంతో చేసిన విచారణలో కొమ్మిరెడ్డిపల్లికి చెందిన ఇసుక లారీ ఢీకొట్టడం వల్లే ఈ యువకులు చనిపోయారని తేల్చారు. వెంటనే తిరుమలాపూర్‌లో ఉన్న లారీని గురువారం సీజ్‌ చేశారు. 


రాజాపూర్‌ ఘటనపై నివేదిక ఇవ్వండి

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):  మహబూబ్‌నగర్‌ జిల్లా  రాజాపూర్‌ మండలానికి చెందిన దళిత రైతును ఇసుక మాఫియా లారీతో ఢికొట్టి చంపిన ఘటనపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ స్పందించింది.  జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణజరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  


ఇసుక మాఫియాకు టీఆర్‌ఎస్‌ అండ: డీకే అరుణ

టీఆర్‌ఎస్‌ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌లో ఇటీవల ఇసుక లారీ ఢీకొట్టి చనిపోయిన రైతు నరసింహులు కుటుంబాన్ని శనివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తమ పొలాల గుండా ఇసుక లారీలు రావొద్దని అడ్డుకున్న నరసింహులును ఇసుక లారీతో తొక్కించారని, టీఆర్‌ఎస్‌ నేతల ప్రోద్బలంతో కేసును తారుమారు చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నరసింహులు సోదరుడు సైతం ఆరు నెలల క్రితం ఇసుక దిబ్బలు కూలి చనిపోతే, అప్పట్లో రూ.15 లక్షల పరిహారమిప్పిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు హామీ ఇచ్చి, కేసు లేకుండా చేశారని, ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-02T08:52:20+05:30 IST