కనుకొనల్లోంచి రెండు కవితలు

ABN , First Publish Date - 2021-03-01T06:40:16+05:30 IST

అతడు సంసారంపట్ల విరక్తి చెందినపుడు ఇల్లొదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతే బాగుండు అనుకునేవాడు...

కనుకొనల్లోంచి రెండు కవితలు

అమ్మా నాన్న

అతడు సంసారంపట్ల విరక్తి చెందినపుడు

ఇల్లొదిలి

ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతే బాగుండు

అనుకునేవాడు

ఆమె కూడా

అలాంటి విరక్తే కలిగినపుడు

ఇల్లొదిలి

ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతే బాగుండు

అనుకునేది

కానీ

నిద్రలో

అమ్మ పొట్టమీద కాలువేసి

పసిబాలుడు-

నాన్న బొజ్జమీద కాలువేసి

పసిబాలిక-

ఆ తల్లిదండ్రులిద్దరికీ

ఇల్లొదిలి

దూ... రం... గా

వెళ్లిపోతున్న కలను కూడా

కనీసం రానిచ్చేవాళ్లు కాదు


అమ్మా నానీ

చాలా రోజుల తర్వాత అతడికి

మరణించిన వాళ్లమ్మ

కలలో కనిపించింది

ఆరోగ్యంగా... సంతోషంగా... కాంతివంతంగా...

అంతులేని దయతో

అతడి తలను ప్రేమగా నిమురుతూ

‘ఎలా ఉన్నావు నానీ’

అని అడిగింది

‘మనసేం బాగుండడం లేదమ్మా’

అన్నాడతను అన్నీ తల్చుకొని

బోరున విలపిస్తూ-

పసిపిల్లాడిలా

తల్లి ఒడిలోకి చేరుతూ.

ఆమె కూడా

కొడుకు దుఃఖాన్ని చూడలేక

నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది.

తెల్లారి నిద్రనుండి మేల్కొన్న అతడు

‘అరె!

ఆ కాంతిలోకంలోనైనా

ఎంతో సంతోషంగా ఉన్న

మా అమ్మ కళ్లను

నీళ్లకు గురిచేసాను’

అని పశ్చాత్తాపపడి

‘ఇక మీద అలా జరక్కూడదు’

అని నిశ్చయించుకొని

కాంతిలోకంలో

తనుకానీ తన తల్లికానీ

ఇంకెప్పుడూ

కన్నీళ్లు పెట్టని రీతిలోకి

హృదయాన్ని మలుచుకునే

పనిలో పడ్డాడు.

భగవంతం

Updated Date - 2021-03-01T06:40:16+05:30 IST