ముఖంపై రెండు కవితలు

ABN , First Publish Date - 2021-09-13T06:02:42+05:30 IST

దిగ్గున లేచి కూర్చున్నావు అర్ధరాత్రిలో, నీకు ప్రియమైన ఆ ముఖం వొంగి, నీ పెదాలకు...

ముఖంపై రెండు కవితలు

1

horror 

pure horror

when you realize 

that the face 

you loved

is no more 


like a blade in the throat....

దిగ్గున లేచి కూర్చున్నావు అర్ధరాత్రిలో,

నీకు ప్రియమైన 

ఆ ముఖం వొంగి, నీ పెదాలకు 


ఎంతో దగ్గరగా, తన శ్వాస నీ ముఖాన్ని 

తాకేంత దగ్గరగా 

వచ్చినట్లు కలగనీ, లేచీ, మరిక


వొణికిపోతే, గదంతా చీకటి.   

     దూరంగా

ఉరుముతోన్న

ఆకాశం: వాన ముందటి ఉక్కపోత,


పిల్లలు ఏడుస్తోన్న శబ్దం. లీలగా గాలి.

చెట్లు కదిలి 

ఈ రాత్రిని మరింతగా నీలోపలికి

జొనిపే దృశ్యం. నాలికపిడచకట్టుకుని,

చీకట్లోకి చేతులు 

కళ్ళై తడుముకుంటే, ఏముంది 


అక్కడ? అప్పుడు? నీలోనూ? బయట?


దిగ్గున లేచి కూర్చున్నావు అర్ధరాత్రిలో

నీకు ప్రియమైన 

ఆ ముఖం, నినువీడిపోతోన్నట్లు


ప్రాణం నీలోంచి, అడుగు వెనుక మరొక

అడుగై, క్రమేణా

నీ నుంచి దూరమౌతోన్నట్లు, ఇక 

ఒక స్మృతిగా మిగిలిపోబోతోన్నట్లు!


దిగ్గున లేచి కూర్చున్నావు అర్ధరాత్రిలో--


ఇక, ఆ రాత్రంతా, బయటా, నీలోపలా

వేలవేలచినుకులై

వానదీపంభళ్ళునపగిలి, నీలోంచి


పొటమరించే ఎడతెగని రంపపు కోత!


2

this darkness

is a grave

& your longing 

for the sun 

is not 

a lie- 

వీధులు, కలల్లోని రాత్రులు

ప్రియ వదనంపై శ్వేతవస్త్రాన్ని కప్పినట్లు

ఆకాశం, వెలుతురూ-

చివరిసారిగా, ఆ ముఖంలో నువ్వు

నవ్వుని చూసింది ఎన్నడు? తడిచి నానిన

వాసన నీ చుట్టూతా-

బహుశా, నువ్వే, ఒక చివికిన చెక్క


ముక్కగా మారుండవచ్చు. ‘‘ఎంతో పచ్చగా

బ్రతికినకొమ్మది,

ఒకప్పుడు’’ అని పదుగురికీ నువ్వు


కవితల్లోనో, మాటల్లోనో చెప్పి ఉండవచ్చు-

లేక, నీలో నువ్వే 

పలుమార్లు గొణుక్కుని ఉండవచ్చు...


మబ్బు కమ్మిన ఆకాశం. నైరాశ్యాన్ని ఊదే

గాలి గుండె. చుట్టూ 

అంతా మసకగా, అంతా జిగటగా ఇక 


వేలకోరలతో ఏదో నిన్ను బిగించి పట్టుకుని 

నిను మరి వీడక 

క్రమేణా, నీలోకిచొచ్చుకుపోతోన్నట్లు!


ఆఖరిసారిగా ముఖాన్ని చూసుకుని, ఇంటి 

దారి పట్టావు. ‘‘చిక్కి

శల్యమై, ఎముకల పోగులా మారిన 


తన శరీరంలా ఈ రాత్రీ, నిన్ను ఎన్నటికీ

ఇంటికి చేర్చలేనీ

వీధులు’’ అని కూడా అనుకున్నావు--


నీకు ప్రియమైన ముఖం పొగమంచులా 

మారుతోన్ననింగి, నేలా!

ఎక్కడ? ఈ తెరలను చీల్చుకుంటూ


సర్వాన్ని తాకి, తిరిగి పునరుజ్జీవింపజేసే

నునువెచ్చని

పసిడి నదీ, నావా అయిన చేయీ


ఆ చేయివంటి జీవకాంతీ ఎక్కడ?

శ్రీకాంత్‌


Updated Date - 2021-09-13T06:02:42+05:30 IST