లిఫ్టు డోరు తెరుచుకోక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి

ABN , First Publish Date - 2020-09-24T15:53:02+05:30 IST

మహానగరం ముంబైలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు లిఫ్టు లోపలే మృతి చెందారు.

లిఫ్టు డోరు తెరుచుకోక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి

ముంబై: మహానగరం ముంబైలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు లిఫ్టు లోపలే మృతి చెందారు. ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బేస్‌మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వచ్చారు. అయితే లిప్టు తలుపులు తెరుచుకోలేదు. బేస్‌మెంట్‌లో నిండిన నీరంతా లిఫ్టులోనికి ప్రవేశించి అది నిండిపోయింది. సెక్యూరిటీ గార్డులిద్దరూ ఎంత ప్రయత్నించినా లిఫ్టు డోరు తెరుచుకోలేదు. ఫలితంగా లిఫ్టులోని నీటిలో మునిగి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ముంబైలోని కాలా-పాణీ జంక్షన్ సమీపంలోని నైథానీ రెసిడెన్స్ భవనాన్ని కొన్నేళ్ల క్రితం నిర్మించారు. జమీర్ సోహనన్(32), షహజాద్ మేనన్(37) ఈ బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వారు బిల్డింగ్‌కు నీటిని సప్లయ్ చేసేందుకు పంప్ దగ్గర స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లారు. ఆ పంప్ స్విచ్ బేస్‌మెంట్ దగ్గరుంది. ఇందుకోసం వారు లిఫ్టు ద్వారా అక్కడికి వెళ్లారు. 





వారు బేస్‌మెంట్‌కు చేరుకుని చూడగానే అక్కడంతా నీరు నిండిపోయివుంది. దీంతో వారు లిప్టు నుంచి బయటకు రాకుండా, తలుపులు మూసివేశారు. తరువాత పైకి వెళ్లేందుకు లిఫ్టుకు కాల్ చేశారు. అయితే లిప్టు కదలలేదు. దీంతో వారు ఆందోళనకు లోనయ్యారు. ఇంతలో బేస్‌మెంట్‌లోకి నీరు ఉధృతంగా వచ్చిచేరింది. దీంతో వారు లిఫ్టులో చిక్కుకుపోయారు. అయినా లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో వారు లిఫ్టు అలారం మోగించారు. దానిని విన్న బిల్డింగ్‌లోని కొంతమంది ఆ లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, లిఫ్టు పైభాగాన్ని కట్ చేశారు. తరువాత వారు లోనికి వెళ్లి చూడగా, ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నీటిలో మునిగిపోయివున్నారు. దీంతో వారిని వెంటనే బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరిశీలించి, అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-24T15:53:02+05:30 IST