ఆఫ్ఘనిస్థాన్‌లో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిల హత్య

ABN , First Publish Date - 2021-01-17T20:43:14+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఓవైపు శాంతి యత్నాలు సాగుతుండగా, మరొకవైపు ఉన్నత స్థానాల్లోని ప్రముఖులను

ఆఫ్ఘనిస్థాన్‌లో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిల హత్య

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఓవైపు శాంతి యత్నాలు సాగుతుండగా, మరొకవైపు ఉన్నత స్థానాల్లోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యాకాండ యావత్తు ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేస్తోంది. 


ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం కాబూల్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. ఉన్నత స్థాయి అధికారులు, నేతలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న ఈ నగరంలో ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. 


సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫాహిం కవీమ్ ఆదివారం మాట్లాడుతూ, ఇద్దరు మహిళా జడ్జిలు కోర్టు వాహనంలో కోర్టుకు వస్తుండగా దాడి జరిగిందని చెప్పారు. నగరంలోని పోలీస్ డిస్ట్రిక్ట్-4 పరిధిలోని తైమని నెయిబర్‌హుడ్‌లో జరిగిన ఈ దాడిలో ఇద్దరు మహిళా జడ్జిలను కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ సహా ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు కోసం పని చేస్తున్న మహిళా జడ్జిలు సుమారు 200 మంది ఉన్నారని తెలిపారు. 


ఇదిలావుండగా, ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ సహా ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. అనేక మంది ప్రముఖులను హత్య చేస్తున్నారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో ప్రముఖ రాజకీయ నేతలు, పాత్రికేయులు, యాక్టివిస్టులు, డాక్టర్లు, ప్రాసిక్యూటర్లు ఉన్నారు. పట్టపగలే ఉగ్రవాద దాడులు జరుగుతుండటం మరింత దారుణం. 


2017 ఫిబ్రవరిలో ఆఫ్ఘనిస్థాన్ సుప్రీంకోర్టుపై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ సూసైడ్ బాంబర్ కోర్టులోకి దూసుకెళ్లి, తనను తాను పేల్చుకోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, 41 మంది గాయపడ్డారు. 


Updated Date - 2021-01-17T20:43:14+05:30 IST