టెస్టు సిరీస్‌కు రాహుల్‌ దూరం

ABN , First Publish Date - 2021-11-24T08:50:25+05:30 IST

న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభానికి ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయంతో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సిరీస్‌ నుంచి వైదొలిగాడు.

టెస్టు సిరీస్‌కు రాహుల్‌ దూరం

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభానికి ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయంతో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. గురువారం నుంచే తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈడెన్‌లో చివరి టీ20కి ముందే రాహుల్‌ తన నొప్పి గురించి మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ‘రాహుల్‌ తొడ కండరంపై ఒత్తిడి పడుతుండడంతో నొప్పి పెరుగుతోంది. అందుకే సిరీ్‌సకు దూరమయ్యాడు. కోల్‌కతా నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయాడు. పునరావాస శిబిరంలో భాగంగా అక్కడి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరతాడు. అయితే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీ్‌సకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది’ అని బోర్డు తెలిపింది. ఇప్పటికే విశ్రాంతి పేరిట కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి టెస్టుకు దూరం కాగా రోహిత్‌, పంత్‌ సిరీస్‌ నుంచే తప్పుకొన్నారు. తాజాగా రాహుల్‌ కూడా వైదొలగడంతో బ్యాటింగ్‌ విభాగంపై ప్రభావం పడనుంది.


ఓపెనర్‌గా గిల్‌?

రాహుల్‌ లేకపోవడంతో తొలి టెస్టులో శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉంది. నిజానికి మయాంక్‌-రాహుల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగితే గిల్‌ మిడిలార్డర్‌లో ఆడేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గిల్‌ను ప్రమోట్‌ చేయవచ్చు. మంగళవారం నెట్‌ సెషన్‌లో కూడా ఈ జోడీ ఫుల్‌ ప్రాక్టీస్‌  చేసింది. ఇక మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌లలో ఒకరి అరంగేట్రం ఖాయమే. అలాగే వెటరన్‌ అశ్విన్‌ జూన్‌ తర్వాత టెస్టు ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తే అశ్విన్‌, జడేజాతో పాటు అక్షర్‌కు చాన్క్‌ దక్కవచ్చు. అదే జరిగితే జయంత్‌ యాదవ్‌కు నిరీక్షణ తప్పదు. 




పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్తాం..: కివీస్‌ కోచ్‌

పరిస్థితులు అనుకూలిస్తే భారత్‌తో జరిగే తొలి టెస్టులో ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌  తెలిపాడు. ‘పర్యాటక జట్లు ఇక్కడ ఆడినప్పుడు ఎందుకు ఓడిపోయాయనే విషయం అర్థం చేసుకోవాలి. సంప్రదాయక నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో ఆడేస్తామంటే ఇక్కడ కుదరదు. మేమైతే స్థానిక పిచ్‌ను గమనించి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది’ అని స్టీడ్‌ చెప్పాడు. దీంతో భారత సంతతి లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌కు కివీస్‌ జట్టులో చోటు దక్కవచ్చు.

Updated Date - 2021-11-24T08:50:25+05:30 IST