ఈ పూజ చేస్తే లాభం బాసూ!

ABN , First Publish Date - 2021-01-21T05:57:56+05:30 IST

ధనలాభం వస్తుందంటూ తిరుపతికి చెందిన ఇద్దరు వ్యాపారులను దొంగ స్వామీజీ లు నమ్మించి 60 గ్రాముల బంగారం దోచుకున్నారు

ఈ పూజ చేస్తే లాభం బాసూ!

బంగారంతో ఉడాయించిన దొంగ స్వామీజీలు 


మదనపల్లె క్రైం, జనవరి 20: పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందనీ, ధనలాభం కలుగుతుందన్న స్వామీజీల బృందం మాటలను అన్నదమ్ములు నమ్మారు. దీంతో బంగారు గొలుసులు తీసి చేతికివ్వగా, క్షణాల్లో ఆ దొంగ స్వామీజీలు మాయమైన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. తిరుపతి ఎంఆర్‌పల్లె మారుతీనగర్‌కు చెందిన రామాయణం మురళి, అతని సోదరుడు విశ్వనాథ్‌ టమోటాల వ్యాపారం చేస్తుంటారు. మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లె మార్కెట్‌యార్డులో టమోటాలు కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగా రెండువారాల కిందట టమోటాలు కొనుగోలు చేసి ఓ లారీలో తిరుపతికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి కోసం పీలేరు సమీపంలో కాసేపు వాహనం నిలపగా, రాజస్థాన్‌ నుంచి వచ్చామంటూ ఓ స్వామీజీల బృందం వీరిద్దరినీ కలిసింది. ధర్మస్థలంలో పూజలు చేయిస్తే విశేష ధనలాభం వస్తుందని చెప్పారు. ఇందుకు 50కిలోల నెయ్యి, రూ.20 వేల నగదు ఇవ్వాలని కోరగా, అన్నదమ్ములు నిరాకరించారు. ఇదే స్వామీజీల బృందం మంగళవారం రాత్రి మదనపల్లె మండలం తట్టివారిపల్లె వద్ద మురళి, విశ్వనాథ్‌కు ఎదురుపడింది. ఒంటిపై వున్న బంగారం తీసిస్తే కళ్లముందే పూజలు చేసి ధనలాభం వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. వీరి మాయలో పడిన అన్నదమ్ములు తమ మెడలోని 60 గ్రాములున్న రెండు బంగారు గొలుసులను వారి చేతికిచ్చారు. అయితే పూజలు చేసే సమయంలో ఏ ఒక్కరూ దగ్గరగా ఉండరాదని చెప్పడంతో, ఇద్దరూ కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డారు. ఇదే అదనుగా దొంగ స్వామీజీల బృందం అక్కడున్న కారెక్కి బంగారంతో ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసులు చెప్పారు. 

Updated Date - 2021-01-21T05:57:56+05:30 IST