ఈ పిల్లర్లకు రెండేళ్లు!

ABN , First Publish Date - 2021-12-06T04:43:23+05:30 IST

ప్రజాసౌకర్యార్థం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని 32వ రైల్వేగేటు వద్ద చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ పిల్లర్లకు రెండేళ్లు!
ఆగిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు

నత్తనడకన జహీరాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి నిర్మాణం

ప్రారంభించిన పనులు సగమే

మిగిలిన సగం పనులకు మోక్షమెపుడో.. పూర్తయ్యేదెపుడో?


  జహీరాబాద్‌ డిసెంబరు 5: ప్రజాసౌకర్యార్థం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని 32వ రైల్వేగేటు వద్ద చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 65వ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న జహీరాబాద్‌లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.90కోట్ల నిధులను కేటాయించింది. ఆ నిధులతో రైల్వేగేట్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు బీవీఎ్‌సఆర్‌ అనే నిర్మాణ సంస్థకు ప్రభుత్వం పనులను అప్పగించింది.  2019 లో ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తదనంతరం డిసెంబరు 14, 2019లో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పనులు ప్రారంభించి రెండేళ్లవుతున్నా ఇంకా 50శాతం పనులు కూడా పూర్తికాలేదు. మూడేళ్లలో పూర్తిచేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ దిశగా పనులు జరగడం లేదు. నిర్మాణ గడువు మరో ఏడాది మాత్ర మే ఉంది. రెండేళ్లలో కనీసం 50శాతం కూడా పూర్తికాని పనులు ఏడాదిలో ఎలా పూర్తిచేస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు

32వ రైల్వే గేటు వద్ద నిర్మిస్తున్న నిర్మాణ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు జరగడం కనిపించడం లేదు. బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వేలైన్‌కు ఇరువైపులా పిల్లర్లు ఏర్పాటు చేసి కొంతమేర వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు తప్ప మిగతా పనులను అలాగే వదిలేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు.


గుంతలమయంగా తాత్కాలిక రోడ్డు

 రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు గుంతలమయంగా మారి అధ్వానంగా మారింది. ఆ మార్గం గుండా అధిక సంఖ్యలో వాహనాలు వెళ్తుండడంతో ప్రయాణికులు, దుకాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


అధికారుల పర్యవేక్షణ కరువు

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించడంలో రోడ్డు, భవనాలశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఏదో ఒకసారి చుట్టపుచూపులా వచ్చి పనులను పరిశీలించి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జహీరాబాద్‌లోని రోడ్డు, భవనాల కార్యాలయంలో కూడా అధికారులు అందుబాటులో ఉండడం లేదు.   జహీరాబాద్‌లోని  రోడ్లుభవనాలశాఖలో డీఈతో పాటు ఏఈ, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, నలుగురు గ్యాంగ్‌మ్యాన్లు ఉన్నారు. ఇంత మంది సిబ్బంది ఉన్నా అటెండర్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ తప్ప మిగతా ఎవరూ ఎప్పుడు కార్యాలయంలో దర్శనం ఇవ్వడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇదేమని అడిగితే దౌరలో (పర్యవేక్షణ)లో ఉన్నామన్న సమాధానం ఇస్తారు. త్వరగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిచేసి తమకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జహీరాబాద్‌ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


సకాలంలో పనులు పూర్తిచేసి సమస్యలు తీర్చాలి

- ఎండీ ముల్తానీ, మాజీ సర్పంచు మచునూర్‌

సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలి. బ్రిడ్జి నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిచిపోవడం వల్ల వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిత్యం ట్రాఫిక్‌తో ఆ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు.


తాత్కాలిక రోడ్డుకు మరమ్మతులు చేయాలి

-అబ్రహం మాదిగ (ఎమ్మార్పీఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు)

రైల్వేగేట్‌ వద్ద చేపడుతున్న వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా వాహనాలు వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డును బాగు చేయాలి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది.




Updated Date - 2021-12-06T04:43:23+05:30 IST