కేన్సర్‌లో రకాలు- నిర్ధారించే పరీక్షలు

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

శరీరంలో ఏ భాగానికైనా వచ్చే కేన్సర్స్‌ దాదాపు వంద రకాలకు పైగా ఉండటమే కాకుండా వాటిలో మళ్లీ ఎన్నో

కేన్సర్‌లో రకాలు- నిర్ధారించే పరీక్షలు

శరీరంలో ఏ భాగానికైనా వచ్చే కేన్సర్స్‌ దాదాపు వంద రకాలకు పైగా ఉండటమే కాకుండా వాటిలో మళ్లీ ఎన్నో సబ్‌ టైపులు కూడా ఉంటాయి. సాధారణంగా మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడటం, పాత కణాలు అంతరించిపోవడం అనే ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ సమతుల్యత దెబ్బతిని కొత్త కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే కేన్సర్‌. 


గడ్డలు ప్రధానంగా రెండు రకాలు

ప్రమాదంలేని గడ్డలు. వీటినే బినైన్‌ ట్యూమర్స్‌ అంటాం. హానికర గడ్డలను మాలిగ్నెంట్‌ ట్యూమర్స్‌ అని అంటారు. బినైన్‌ ట్యూమర్స్‌ ప్రాణాపాయం కానివి. ఇతర శరీర భాగాలకు, చుట్టు పక్కల కణజాలంలోకి ప్రవేశించలేవు. చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. తొలి దశలో సాధారణ సమస్యలాగా కనిపించే కేన్సర్‌ తీవ్రమయ్యే కొద్దీ దగ్గు, తలనొప్పి, వికారం, వాంతులు, మానని పుండు, అలసట, ఆకలి, బరువు తగ్గడం, జ్వరం మొదలైన లక్షణాలు వీడకుండా తగ్గకుండా తీవ్రమవుతుంటాయి. ముదిరిపోవడాన్ని టీఎన్‌మ్‌ సిస్టమ్‌ ద్వారా గుర్తిస్తారు. టి అంటే (ట్యూమర్‌) గడ్డ, ఎన్‌ అంటే లింఫోసోడ్స్‌, ఎమ్‌ అంటే మెటాస్టాసిస్‌(ఇతర భాగాలకు వ్యాపించడం), వీటి తీవ్రత బట్టి కేన్సర్‌ దశను నిర్ధారిస్తారు. 


కేన్సర్‌ ట్రీట్‌మెంట్స్‌ వారి వయసు, ఇతర ఆరోగ్యం కేన్సర్‌ తీవ్రత, ఇతర భాగాలకు వ్యాపించిందా లేదా అన్న విషయాలు మీద ఆధారపడి ఉంటాయి. బ్రెయిన్‌, బ్రెస్ట్‌, లంగ్‌, సర్వైకల్‌ కేన్సర్‌ అని రకరకాలుగా ఉన్నా, మళ్లీ వాటిలో ఎన్నో రకాలుగా విభజించబడి ఉంటాయి. ఒక్క బ్రెస్ట్‌ కేన్సర్‌నే తీసుకుంటే 10 రకాలకు పైన ఉన్నాయి. 


1. కార్సినోమా- చర్మం, అంతార్గత అవయవాల లోపల పొర లేక బాహ్య పొరలమీద వచ్చే క్యాన్సర్‌.

2. సార్కొమా - ఎముకలు, కొవ్వు, కార్టేజీ రక్తనాళాలు, లేక ఆయా అవయవాలను పట్టి ఉంచే కణజాలానికి వచ్చే కేన్సర్‌

3.లింఫోమా - రోగనిరోధక వ్యవస్థకు చెందిన లింఫ్‌ గ్రంథులు సంబంధిత కణజాలానికి వచ్చే కేన్సర్‌

4. ల్యూకేమియా - ఎముకల మజ్జలో తయారయ్యే రక్తకణాలలో వచ్చే కేన్సర్‌


కేన్సర్‌ చికిత్సలో సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ పాత్ర చాలా ప్రముఖమైనది. అంతే కాకుండా చికిత్సల ముందు తర్వాత మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ల పాత్రలు కూడా చాలా కీలకమైనవి. బ్లడ్‌ కేన్సర్‌కు తప్పితే మిగతా అన్ని కేన్సర్స్‌కు సర్జరీ, రేడియేషన్‌, కీమోథెరపీ దాదాపుగా తప్పనిసరి. కేన్సర్‌ చికిత్సకు లొంగడం లేదు అని తెలిస్తే దాదాపు లేటుదశ అని అర్థం చేసుకోవచ్చు. ఇతర శరీర భాగాలకు కూడా పాకినప్పుడు మందులతోనే మేనేజ్‌ చేస్తారు.


ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌, ఎక్స్‌రే, అల్ర్టాసౌండ్‌ స్కాన్‌, సిటీస్కాన్‌, న్యూక్లియర్‌స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌, పిఇటి స్కాన్‌, బయాప్సి, ఫైన్‌నీడిల్‌, యాస్పిరేషన్‌ సైటాలజి, బ్లడ్‌ మార్కర్స్‌ మొదలగు పరీక్షలను అవసరాన్ని బట్టి చేస్తారు. ట్రీట్‌మెంట్స్‌ అయిపోయాక మొదటి ఐదు సంవత్సరాల వరకు ఫాలోఅప్‌ కేర్‌లో అవసరమైన పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. మొదటి ఐదు సంవత్సరాలలో కేన్సర్‌ తిరిగి రాకపోతే దాదాపుగా పూర్తిగా నయం అయినట్లే కానీ కొంత మందిలో 10, 20 సంవత్సరాల తర్వాత కూడా కన్పించిన సందర్భాలున్నాయి. కాబట్టి కేన్సర్‌ అదుపులో ఉందని మాత్రమే అంటారు. 

డాక్టర్‌ మోహన వంశీ, 

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421


Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST