UAE పాస్‌పోర్ట్ చాలా పవర్‌ఫుల్.. భారత Passport ర్యాంక్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-10-05T17:45:33+05:30 IST

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి ఉపయోగించేదే పాస్‌పోర్ట్.

UAE పాస్‌పోర్ట్ చాలా పవర్‌ఫుల్.. భారత Passport ర్యాంక్ ఎంతంటే..

అబుదాబి: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి ఉపయోగించేదే పాస్‌పోర్ట్. ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ మారదు. కానీ, వీసా మాత్రం దేశదేశానికి మారుతూ ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేసే తమ పౌరుల సంక్షేమం కోసం సొంతదేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. దీనిలో భాగంగానే పాస్‌పోర్టులను అందిస్తుంటాయి. అంతర్జాతీయ సమాజంలో తమ పౌరుల భద్రత, వారికి ప్రత్యేక గుర్తింపును కల్పించేలా కొన్ని దేశాలు పాస్‌పోర్టులను జారీ చేస్తుంటాయి. ఇలా ఆయా దేశాలు ఇచ్చే పాస్‌పోర్టులలో తాజాగా యూఏఈ పాస్‌పోర్ట్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది. 


ఆర్టన్ క్యాపిటల్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అత్యధిక మొబిలిటీ స్కోర్‌తో యూఏఈ పాస్‌పోర్ట్ మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ఈ పాస్‌పోర్టుతో ఏకంగా 152 దేశాల్లో ఎంట్రీకి అనుమతి ఉంది. 98 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. 54 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. అలాగే 46 దేశాల్లో ఎంట్రీకి ముందు వీసా అవసరం ఉంటుంది. యూఏఈ జాయెద్ సంవత్సరంగా జరుపుకున్న 2018 డిసెంబర్‌లో తొలిసారి ఆ దేశ పాస్‌పోర్టు మొదటి ర్యాంకు దక్కించుకుంది. 2019లో కూడా టాప్‌లోనే ఉంది. కానీ, 2020లో 14వ ర్యాంక్‌కు పడిపోయింది. తిరిగి ఈ ఏడాది మళ్లీ తొలిస్థానానికి ఎగబాకి అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మారింది. కాగా, ర్యాంకింగ్ అనేది కదలిక స్వేచ్ఛ, పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసా రహిత ప్రయాణంపై ఆధారపడి ఉంటుంది.


ఇక యూఏఈ తర్వాత న్యూజిల్యాండ్ పాస్‌పోర్టు 146 దేశాల ఎంట్రీతో రెండో స్థానం దక్కించుకుంది. అలాగే జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రియా, స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, లక్సెంబర్గ్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నవారికి 144 దేశాల్లో ప్రవేశానికి అనుమతి ఉంది. ఈ దేశాలన్నీ మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాయి. యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, మాల్టా, గ్రీస్, పోలాండ్, హంగేరీ పాస్‌పోర్ట్స్ 142 దేశాల ఎంట్రీతో ఐదో స్థానానికి పరిమితమయ్యాయి. 


ఇతర గల్ఫ్ దేశాలైన ఖతర్, కువైత్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ పాస్‌పోర్ట్స్ వరుసగా 47, 50, 52, 55, 56 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ 72వ స్థానంతో నిలిచింది. మన పాస్‌పోర్టుతో 20 దేశాలకు వీసా రహితంగా వెళ్లొచ్చు. 36 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. 142 దేశాల్లో వీసా కావాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. అత్యంత బలహీనమైన పాస్‌పోర్టుల జాబితాల్లో ఆఫ్ఘానిస్థాన్ పాస్‌పోర్టు తొలిస్థానంలో ఉంటే.. ఆ తర్వాత వరుసగా ఇరాక్, సిరియా, పాకిస్థాన్, సోమాలియా, యెమెన్, మయన్మార్, పాలస్తీనా, ఎరిట్రియా, ఇరాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి.

Updated Date - 2021-10-05T17:45:33+05:30 IST