మరోమారు లాక్‌డౌన్ వార్తలపై స్పందించిన యూఏఈ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-09-28T14:31:24+05:30 IST

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా.. యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ను అమ

మరోమారు లాక్‌డౌన్ వార్తలపై స్పందించిన యూఏఈ ప్రభుత్వం!

అబుధాబి: కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా.. యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించిందనే వార్తలపై అక్కడి  ప్రభుత్వం స్పందించింది. అటువంటి ఆలోచన లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజులుగా యూఏఈలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోమారు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనుందనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుందనేది వాటి సారాంశం. దీంతో యూఏఈ ప్రజలు.. తీవ్ర గందరగోళానికి లోనయ్యారు.


ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం.. ఆ వార్తలను కొట్టిపారేసింది. యూఏఈలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. ఇదిలా ఉంటే.. ఆదివారం రోజు యూఏఈ వ్యాప్తంగా 1.06లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. 851కేసులు బయటపడినట్లు తెలిపింది. ఇదే సమయంలో 868 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని.. కరోనా కాటుకు ఒకరు మృతి చెందారని వివరించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల సంఖ్య 9.3మిలియన్లు దాటిందని పేర్కొంది. 


Updated Date - 2020-09-28T14:31:24+05:30 IST