గల్ఫ్‌-భారత్‌ మధ్య నిలిచిన రాకపోకలు.. ప్రవాసీల ఆవేదన

ABN , First Publish Date - 2021-07-18T13:45:03+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన ప్రసన్న సోమిరెడ్డి తల్లి అకస్మాత్తుగా మరణించింది. సోమిరెడ్డి దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. మాతృమూర్తి మరణ వార్త తెలియగానే ఆయన తల్లడిల్లిపోయారు.

గల్ఫ్‌-భారత్‌ మధ్య నిలిచిన రాకపోకలు.. ప్రవాసీల ఆవేదన

కడసారి చూపునకూ నోచుకోలేక.. ఆప్తులను కోల్పోయిన ప్రవాసీల వేదన 

భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం 

31 వరకు గడువు పొడిగించిన యూఏఈ

అమెరికా వెళ్లే విద్యార్థులపై ఆర్థిక భారం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన ప్రసన్న సోమిరెడ్డి తల్లి అకస్మాత్తుగా మరణించింది. సోమిరెడ్డి దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. మాతృమూర్తి మరణ వార్త తెలియగానే ఆయన తల్లడిల్లిపోయారు. వెంటనే బయలుదేరి వచ్చి, ఆమెను కడసారి చూద్దామనుకున్నా.. వీలు కాలేదు. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లారు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన షేక్‌ మస్తాన్‌ వలీ. ఇటీవల అనారోగ్యంతో ఆయన భార్య కన్ను మూసింది. విషయం తెలిసిన వలీ కన్నీరుమున్నీరయ్యారు. అప్పటికప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకుని భారత్‌ బయలుదేరాలకున్నా.. సాధ్యపడలేదు.


ఇలా అనేక మంది తెలుగు ప్రవాసీలు తమ ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తమ వారిని కడసారి చూసేందుకైనా వెళదామంటే భారతీయ విమానాల రాకపై అక్కడ నిషేధం ఉంది. దీంతో ప్రవాసీల వేదన వర్ణనాతీతంగా ఉంది. సాహసం చేసి తండ్రిని అంతిమంగా చూడటానికి వెళ్లిన విశాఖపట్టణానికి చెందిన దాసరి అప్పారావు వంటి వారు మాతృదేశంలో ఇరుక్కుపోయి తిరిగి రాలేకపోతున్నారు. గతంలో కరోనా విజృంభించిన సమయంలో తమ దేశాల్లోకి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని గల్ఫ్‌ దేశాలు ఇంకా కొనసాగిస్తుండడంతో ప్రవాసీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారు తిరిగి గల్ఫ్‌ దేశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్‌ ప్రయత్నించినా.. కీలక గల్ఫ్‌ దేశాలు భారతీయ విమానాల రాకను ఒప్పుకోవడం లేదు. తాజాగా భారతీయ విమానాల రాకపై ఉన్న నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన ప్రవాసీలకు శరాఘాతంగా మారింది.


ఇత్తెహాద్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌ లైన్లు భారత్‌ నుండి ఈ నెలాఖరు వరకు విమానాలను నడపబోమని ప్రకటించాయి. ప్రస్తుతం అమెరికాలో విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. వందలాది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ రెండు ఎయిర్‌ లైన్స్‌ ద్వారా యూఏఈ మీదుగా అమెరికా వెళ్తారు. అమెరికా, యూరప్‌ దేశాల రూట్లలో ఈ రెండు ఎయిర్‌ లైన్స్‌లు తక్కువ ధరలకు టికెట్లను విక్రయిస్తాయి. ప్రస్తుత నిషేధం వల్ల విద్యార్థులు అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేసి, ఇతర రూట్ల ద్వారా అమెరికా వెళ్తున్నారు. కువైత్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, ఒమన్‌ కూడ భారతీయ విమానాల రాకపై నిషేధాన్ని కొనసాగిస్తుండటంతో అత్యవసర పనుల కోసం మాతృభూమికి వెళ్లిన తెలుగు ప్రవాసీలు గల్ఫ్‌కు తిరిగి రాలేక ఉద్యోగాలు కోల్పోతున్నారు. గల్ఫ్‌ దేశాల నుండి భారత్‌కు వెళ్లడానికి అరకొర విమానాలు నడుస్తున్నా, అక్కడి నుండి వచ్చే విమానాలపై మాత్రం ఇంకా నిషేధం కొనసాగుతోంది.


Updated Date - 2021-07-18T13:45:03+05:30 IST