రాజ్యాంగ విలువల ఉపేక్షే ‘ఊపా’

ABN , First Publish Date - 2021-04-09T05:43:46+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఎ) దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రజా సం ఘాల నాయకుల ఇళ్ళపై...

రాజ్యాంగ విలువల ఉపేక్షే ‘ఊపా’

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఎ) దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రజా సం ఘాల నాయకుల ఇళ్ళపై ఆకస్మికంగా విరుచుకుపడి గంటల తరబడి సోదాలు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. తమ ఆఫీసుకు వచ్చి కలవాలని ఆ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ వైఖరి భారత ఫెడరల్‌ స్ఫూర్తికి, రాజ్యాంగ సూత్రాల వెలుగులో పయనించే ప్రజాస్వామిక పరిపాలన విధానానికి విరుద్ధం. 


ఉన్నత విలువలతో సమాజ దిక్సూచిగా, ఆదర్శంగా నిలబడుతున్న ప్రజాసంఘాల నాయకులను టార్గెట్ చేసి సమాజం నుంచి మాయం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్న ఎన్‌ఐఏ రాజ్యాంగేతర శక్తిగా రూపొందింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (ఉపా) కేసులన్నింటనీ దర్యాప్తు చేస్తోంది. బిజెపి సర్కార్ చేతిలో బలమైన ఆయుధంగా ఊపా ఉపయోగపడుతోంది. 2021 మార్చి 31న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్ళ మీద ఎన్‌ఐఎ ఆకస్మికంగా దాడులు చేసి సోదాలు నిర్వహించి గంటల తరబడి ప్రశ్నించి వాళ్ళే తెచ్చిన మెటీరియల్‌ను ఇంట్లో పెట్టి, ఫొటోలు తీసుకుని నేరపూరిత వస్తువులు దొరికాయని, ఆ నేతలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని నిర్ధారించి మరుసటి రోజు ఎన్‌ఐఎ కార్యాలయాల్లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 30 మంది నివాసాలపై ఏకకాలంలో దాడి చేసి ఇదే పద్ధతిని అనుసరించారు. 


హైదరాబాదులో రఘునాధ్‌–పౌరహక్కుల సంఘం, జాన్‌–ప్రజా కళామండలి, దేవేంద్ర–చైతన్య మహిళా సంఘం, శిల్ప–చైతన్య మహిళా సంఘం, డప్పు రమేష్‌ –ప్రజా గాయకుడు, స్వప్న–చైతన్య మహిళా సంఘం, దేవేందర్‌–దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం; ప్రొద్దుటూరులో వరలక్ష్మి–విరసం, కర్నూలులో పాణి–విరసం, ప్రకాశం జిల్లా గణపవరంలో అంజమ్మ–-అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో–శిరీష, గుంటూరు జిల్లా తాడేపల్లిలో–రాజేశ్వరి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో–చిట్టిబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చిలుకా చంద్రశేఖర్‌– పౌరహక్కుల సంఘం, వైజాగ్‌లో పద్మ–రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, వైజాగ్‌లో కెఎస్‌ చలం–అడ్వకేట్‌, విఎస్‌ కృష్ణ–మానవ హక్కుల వేదిక, శ్రీకాకుళం జిల్లా రాజమండ్రిలో నీలకంఠం–ప్రజాకళామండలి, గూడూరు గ్రామంలో జోగి కోదండం అమరుల బంధుమిత్రుల సంఘం, పల్లిసారధి గ్రామంలో పి.సుమ–చైతన్య మహిళా సంఘం, హైదరాబాదులోని కోఠిలో ఉన్న ఇల్లు, వైజాగులో బాలకృష్ణ– రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, శ్రీరామమూర్తి– పౌరహక్కుల సంఘం, నర్సరావుపేటలో వై.కోటేశ్వరరావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, వైజాగ్‌లో అన్నపూర్ణ ప్రగతిశీల కార్మిక సంఘం, మంగళగిరిలో బి.కొండారెడ్డి–ప్రగతిశీల కార్మిక సంఘం, విజయవాడలో దుడ్డు ప్రభాకర్‌, గుంటూరు న్యాయవిద్యార్థి క్రాంతి, తెనాలిలో కృష్ణ-–కుల నిర్మూలన పోరాట సమితి మొదలైన వారి ఇళ్ళపై దాడి చేసి, ఏడు, ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. పుస్తకాలు, సాహిత్యం, పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, డబ్బులు తీసుకెళ్ళారు. ఈ సోదాలో 70 హార్డ్‌ డిస్క్‌లు, 19 పెన్‌డ్రైవ్‌లు, 40 సెల్‌ఫోన్‌లు, 44 సిమ్‌కార్డులు, 184 డివిడిలు, ఒక ల్యాప్‌టాప్‌, ఆడియోరికార్డర్‌, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్‌ నోట్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్‌ఐఎ ప్రకటించింది. 


మావోయిస్టులతో ప్రజాసంఘాల నాయకులకు సంబంధాలున్నాయన్న ఆరోపణ పోలీసులు తగినంతగా పరిశోధన చేసి నిర్ధారించిన అంశం కాదు. కేవలం ప్రజా సంఘాల లెటర్‌ప్యాడ్‌లు సేకరించి, అందులోఉన్న బాధ్యుల పేర్ల మీద నేరారోపణ చేయదలచి చేస్తున్న పని ఇది. యాదృచ్ఛికంగా అరెస్టయిన ఒక వ్యక్తి వెల్లడించినట్లుగా పోలీసులు రాసిన ఒక ఒప్పుకోలు పత్రంపై అతడితో బలవంతంగా సంతకం చేయించి, ‘ఇదిగో ఈయన వెల్లడించాడు కనుక వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయ’ంటూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. ఉపా చట్టం, పబ్లిక్‌ సెక్యూరిటీ చట్టం కింద సెక్షన్లు నమోదు చేసిన వెంటనే ఎన్‌ఐఎ వాలిపోయి అమాంతంగా వ్యవహారాన్నంతా తన చేతిలోకి తీసుకుని నిందితుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 


జప్తు చేసుకున్న హార్డుడిస్కుల్లో వారికి కావల్సిన నేరపూరిత సమాచారం దొరకదు కనుక చౌకబారు ఎత్తుగడలకు పాల్పడి అందులో అలాంటి సమాచారం నింపుతారు. సోదాల కోసం వచ్చినప్పుడు తమతో తెచ్చుకున్న సామాగ్రిని ఇంట్లో పెట్టి ఫొటోలు తీసేవాళ్ళు, తమ చేతికి చిక్కిన ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లలో తప్పుడు విషయాలు చేర్చరని ఎలా భావించగలం? గతంలో ప్రొఫెసర్‌ సాయిబాబా కేసు విషయంలో హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకుపోయిన పోలీసులు, టాంపరింగ్‌తో వాటిని నేరమయం చేసి జీవితఖైదు పడేలా చేశారు. న్యాయస్థానాలు నిష్పక్షపాతం, స్వతంత్రత కోల్పోయి రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయేంతగా బలహీనపడ్డాయి. ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ సాక్ష్యాల ఆధారంగా శిక్షలు వేయడం ఈ శతాబ్దపు విషాదం. 


భీమాకోరెగాం కేసు విషయంలో కూడా కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయి. హ్యాక్‌ అయిన సమాచారం ఆధారంగా అరెస్టులు కొనసాగాయి. వీటి ఆధారంగానే శిక్షలు నిర్ధారించే అవకాశాలున్నాయి. భీమాకోరెగాం నిందితుల్లో ఒకరైన హక్కుల నేత రోనా విల్సన్‌ ల్యాప్‌టాప్‌ హ్యాక్‌ చేసి ఓ 10 లేఖలు అందులో జొప్పించారు. ఇది ఆయన అరెస్టుకు ముందే జరిగింది. హ్యాక్‌ అయిన విషయాన్ని మసాచుసెట్స్‌కు చెందిన ఆర్సెనల్‌ కన్సల్టింగ్‌ అనే డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సంస్థ బయట పెట్టింది. ఇతర నిందితుల ల్యాప్‌టాప్‌లు కూడా సైబర్‌ దాడికి గురై ఉండవచ్చు. రోనావిల్సన్‌తో పాటు విప్లవ కవి వరవరరావు, సుధా భరద్వాజ్‌, వెర్మన్‌ గోంజాల్వెజ్‌, అరుణ్‌ పెరీరా, గౌతవ్‌ు నవలఖా, సురేంద్ర గాడ్లింగ్‌, సుధీర్‌ ధావాలే, సోమాసేన్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డే మొదలైన హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసి రెండున్నరేళ్ళు గడుస్తున్నా బెయిల్‌ మంజూరు చేయడం లేదు. చత్తీస్‌గఢ్ నుంచి అదే కేసులో 82 సంవత్సరాల స్టాన్‌స్వామిని అరెస్టు చేశారు. ఆ వృద్ధుడికి చేతులు వణుకుతాయి గనుక, తన చేతులతో అన్నం తినలేని సమస్యలతో పాటు అనారోగ్య కారణాల వల్ల కూడ బాధపడుతున్నాడు. వీరిలో వరవరరావుకు మాత్రమే బెయిలు మంజూరు చేసి బొంబై దాటి వెళ్ళొద్దని షరతులు విధించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ఇది తప్పుడు కేసు అని భావించి కొట్టివేసే సందర్భంలో ఎన్‌ఐఎ ఈ కేసును తనకు తానే బదలాయించుకుని దర్యాప్తు చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి ఎన్‌ఐఎ ఓ పనిముట్టుగా మారి వ్యక్తి స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా తయారైంది. ఎన్‌ఐఎ దర్యాప్తు అంత నిందితుల ల్యాప్‌టాపుల్లోని సమాచారం మీద, లేఖల మీద ఆధారపడి ఉంటోంది. దాని ఆధారంగా కేసులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో హక్కుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ముందే సైబర్‌ దాడి జరిపి దాని ఆధారంగా మేధావులను నిందితులుగా చేసి దర్యాప్తు జాప్యం చేస్తూ నిండైన వ్యక్తిత్వాలను జైలుగోడలకు పరిమితం చేస్తోంది. ప్రజలను అనాధలను చేస్తూ హక్కుల గురించి అడిగేవారు లేకుండా చేస్తోంది.


ఉపా క్రూరమైన చట్టం. వ్యక్తిస్వేచ్ఛకు భంగకరం. ఇప్పటి వరకు ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా దాదాపుగా 5200 మందిని నిర్బంధించారు. టెర్రరిస్టు కార్యకలాపాలను అరికట్టడం కోసం రూపొందించిన ఈ చట్టం కింద మగ్గిపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. గతంలో అమలుపరచిన టాడా, పోటాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి వాటిని రద్దు చేసింది. మళ్ళీ కొంతకాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రెండు చట్టాలను మించిన భయంకరమైన ఉపాను ప్రజల మీద రుద్దింది. దీనిని కూడ రద్దు చేసేంత వరకు మరోసారి ప్రజలు మరింత ఐక్యమై పోరాడాలి. ఉపాను వ్యతిరేకించడమంటే హింసను సమర్థించడమేనని బిజెపి అపవాదు వేసినా భయపడవలసిన పని లేదు. రాజ్యాంగం పౌరులకు హామి ఇచ్చిన ప్రాథమిక హక్కులకు, న్యాయస్ధానాల నిష్పాక్షికతకు, సాధారణ విచారణ పద్ధతులకు ఉపా వ్యతిరేకం కనుక దాన్ని వ్యతిరేకిద్దాం. ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా నిర్బంధించిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, అనేక ప్రజాసంఘాల నాయకుల మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలని, సోదాలు, దాడులు, అరెస్టులు ఆపివేయాలని ఉద్యమిద్దాం.

లక్ష్మణ్ గడ్డం

అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం

Updated Date - 2021-04-09T05:43:46+05:30 IST