Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఎమ్మెల్సీ’ తీర్పుపై సర్వత్రా ఆసక్తి

 బలమున్నా టీఆర్‌ఎస్‌ క్యాంపు రాజకీయాలు

 రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు విపక్ష పరోక్ష మద్దతు

 కాంగ్రెస్‌ క్యాంపు ఎవరి కోసం?


కరీంనగర్‌: జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను సులువుగా కైవసం చేసుకునే సంఖ్యా బలం ఉన్నా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన స్థానిక సంస్థల ప్రతినిధులను క్యాంపులకు తరలించడంపై ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. 994 మంది స్థానిక ప్రతినిధులు అధికార పార్టీకి ఉండగా మరో 330 మంది కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం టీఆర్‌ఎస్‌కు కష్టమేమీ కాదు. అయితే ఆ పార్టీ ఎందుకు క్యాంపు రాజకీయాలను చేస్తున్నది. స్వంత పార్టీ సభ్యులపై నమ్మకం కోల్పోయిందా.. క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశముందా...ఈటల రాజేందర్‌ చెబుతున్నట్లుగా రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌ ఇక్కడ విజయం సాధించబోతున్నారా అన్న చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతున్నది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ప్రతిపక్ష పార్టీల్లో రాబోయే ఎన్నికల నాటికి తాము బలపడవచ్చనే ధైర్యం పెరిగింది. ప్రజల్లో అధికారపక్షం పట్ల అసంతృప్తి  పెరుగుతున్నదన్న నిర్ధారణకు వచ్చిన విపక్షం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వేదికగా చేసుకొని టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. 


బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుపైనే చర్చ

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారికంగా అభ్యర్థులను పోటీలో నిలుపక పోయినా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి స్థానిక సంస్థల్లో 100 మంది ప్రతినిధులు ఉండగా కాంగ్రెస్‌కు 200 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడైన డి.శ్రీధర్‌బాబు తన నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ హైదరాబాద్‌లో క్యాంపు వేసి ఉంచారు. ఆ పార్టీ అధికార అభ్యర్థి ఎవరూ రంగంలో లేకున్నా ఎందుకు క్యాంపు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. మంథని నియోజకవర్గానికే చెందిన కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ప్రతినిధి ఇనుముల సతీష్‌ ఇండిపెండెంట్‌గా రంగంలో ఉండి ప్రశ్నించే గొంతుకు అవకాశమివ్వండని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.


శ్రీధర్‌బాబు శిబిరం ఆయనకు అండగా నిలుస్తుందా లేక అధికార పక్షాన్ని దెబ్బతీసే లక్ష్యంతో రవీందర్‌సింగ్‌కు ఓటు వేసి గెలిపిస్తుందా అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఇప్పటికే మూడుమార్లు రవీందర్‌సింగ్‌ ఎమ్మెల్సీగా గెలువబోతున్నారంటూ మీడియా సమావేశాల్లో ప్రకటించారు. రాజేందర్‌ బీజేపీ శాసనసభ్యుడు ఆ పార్టీ అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయినా రాజేందర్‌ పదేపదే చేస్తున్న ప్రకటనలు రవీందర్‌సింగ్‌కు ఆయన మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. రాజేందర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు నుంచే ఉమ్మడి జిల్లా పరిధిలోని తన మద్దతుదారులతో స్థానిక సంస్థల ప్రతినిధులను సమీకరించి వారి మద్దతు కూడగట్టారని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను సూచించిన వారికి ఓటు వేసే విధంగా ఆయన వారిని సంసిద్ధులను చేశారని ప్రచారం జరుగుతోంది. రెబల్‌గా రంగంలో దిగుతున్నానని రవీందర్‌సింగ్‌ ఈటలను కలిసి మద్దతు కోరిన సందర్భంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం మాట్లాడుకుందామని చెప్పి పంపారని ఆ తర్వాత ఆయన పోటీలో ఉండడంతో 300 మంది ఓటర్ల బాధ్యతను తీసుకొని ఓటు వేయించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. 

ఓటర్ల కుటుంబ సభ్యులను కలుస్తూ ప్రచారం

రవీందర్‌సింగ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో తొలినుంచి ఉన్న వ్యక్తిగా అందరితో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఒక ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీకి వేసినా అన్యాయం జరిగిన ఉద్యమసహచరుడిని అయిన తనకు ఇంకో ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పక్షానికి చెందిన సభ్యులందరూ బెంగుళూరు, మైసూర్‌ తదితర ప్రాంతాలకు తరలివెళ్లగా వారి కుటుంబసభ్యులను కలిసి రవీందర్‌సింగ్‌ మద్దతు కోరుతున్నారని తెలిసింది. అలాగే అన్ని రాజకీయపక్షాల నాయకులను కలుస్తూ వారందరి ఆశీస్సులు పొందుతున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాల నేతలు, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తివాదులు, ప్రజాసంఘాల నాయకులు రవీందర్‌సింగ్‌ గెలుపుకోసం తమకు పరిచయం ఉన్న, తమ మాట వినే ప్రతినిధులతో మాట్లాడి ఓట్లు వేయించే బాధ్యత తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. రవీందర్‌సింగ్‌ ఈ ఎన్నికల్లో తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తుండగా అధికార పార్టీకి చెందిన మంత్రుల సారధ్యంలో ఎమ్మెల్యేలందరూ తమతమ నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులను బెంగుళూరు, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా ప్రాంతాలకు తరలించి 15 రోజులపాటు విందులు, వినోదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. 994 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు వారి కుటుంబసభ్యులు, క్యాంపుల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న పార్టీకిచెందిన సీనియర్‌ నేతలు సుమారు 2,200 మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. 


అందరి దృష్టి జిల్లా పైనే..

రాష్ట్రవ్యాప్తంగా 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అందులో ఆరు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కరీంనగర్‌ జిల్లాపైనే ఉంది. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది. సంఖ్యాపరంగా చూస్తే గెలువడానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా లక్షలాది రూపాయలు వెచ్చించి క్యాంపు రాజకీయాలు చేస్తూ లక్షలాది రూపాయల నజరానాలను ఇస్తామని హామీ ఇస్తున్న అధికారపక్షం తీరే రవీందర్‌సింగ్‌కు నైతికంగా ఽధైర్యాన్ని పెంచుతున్నదని రాజకీయపక్షాలు అనుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న జిల్లాలో ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్య్తర్థిగా పోటీచేసి గెలుపొందడంతో తొలి దెబ్బతాకింది. ఇప్పుడు రవీందర్‌సింగ్‌ రెబల్‌గా పోటీలో ఉండడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారపక్షానికి ఏ తీర్పు ఇవ్వనున్నారు..అని అందరూ ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు. 

Advertisement
Advertisement