కొత్త మద్యం పాలసీపై సర్వత్రా ఆసక్తి

ABN , First Publish Date - 2021-10-24T04:31:11+05:30 IST

మద్యం వ్యాపారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త దుకాణాల వేలం పాటలకు త్వరలోనే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. రెండేళ్లుగా కొవిడ్‌-19 విజృంభన నేపథ్యంలో పలు దఫాలు లాక్‌డౌన్‌ విధించారు.

కొత్త మద్యం పాలసీపై సర్వత్రా ఆసక్తి

- నవంబరు 30తో ముగియనున్న లైసెన్సు గడువు

- ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం?

- ఈ సారి అదనంగా మరో మూడు షాపులకు అనుమతి

- గౌడ కులస్థులకు ప్రత్యేక రిజర్వు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మద్యం వ్యాపారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త దుకాణాల వేలం పాటలకు త్వరలోనే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. రెండేళ్లుగా కొవిడ్‌-19 విజృంభన నేపథ్యంలో పలు దఫాలు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో నష్టపోయామన్న వ్యాపారులు విజ్ఙప్తి మేరకు ప్రభుత్వం లైసెన్సింగ్‌ గడువును నెల రోజుల పాటు పొడగించిన విషయం తెలిసిందే. దీంతో నవంబరు మాసాంతానికి లైసెన్సుల గడువు ముగియనుండడంతో ఈనెల చివరి వారంలో కొత్త మద్యం పాలసీపై నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రంగం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జనాభా ప్రాతి పదికన మద్యం దుకాణాలను కేటాంచగా 15మండలాలకు గాను 26మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. ఇందులో ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 13, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 13 మద్యం దుకాణాలున్నాయి. కాగా క్రితంసారి ఏజెన్సీ ప్రాంతంలో ఆది వాసీ సంఘాల వ్యతిరేకత కారణంగా జైనూరు, సిర్పూరు(యూ), లింగాపూర్‌ మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు మార్చారు. తాజాగా ప్రకటించబోయే నూతన మద్యం విధానంలో అక్కడ కూడా ఈ సారి లైసెన్సులు జారీచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి ఆదివాసీ సంఘాలే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మరో మూడు మద్యం దుకాణాలను అదనంగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కొత్త లైసెన్సింగ్‌ పాలసీలో జిల్లాలో మొత్తం 29 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే పరిస్థితులుండొచ్చని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబరు మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించి దుకాణాల కేటాయింపులు పూర్తిచేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఆలోచన ఏంటన్నదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే ఆలోచనలో ఉన్న వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అదీ కాకుండా ఈ సారి దరఖాస్తు ఫారంల విలువ రూ.3లక్షలకు పైన్నే నిర్ణయించే అవకాశాలు న్నట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో గతంలో వచ్చినట్టుగా ఈ సారి స్పందన పెద్దగా వచ్చే పరిస్థితి ఉండక పోవచ్చని అంచనా వేస్తున్నారు. అదీ కాకుండా షాపుల సంఖ్య పెరగటం, కొవిడ్‌తో వ్యాపారం మందగించడం అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యాపారులు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

సరిహద్దుల్లో దుకాణాలకు నిరాసక్తత..

మద్యం వ్యాపారంలో సరిహద్దు దుకాణాలదే హవా... ఎక్సైజ్‌ దృష్టి అంతా కూడా సరిహద్దు దుకాణాలపైన్నే కేంద్రీకృతం చేసి అంకెలతో కుస్తీ పడేది. ఇదంతా ఒకప్పటి మాట. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్‌ జరుగు తున్న విషయాన్ని గుర్తించి చంద్రాపూర్‌ జిల్లాలో నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు లోని వాంకిడి, కెరమెరి, సిర్పూరు(టి), కౌటాల మద్యం దుకాణా లకు టెండరు వేసేందుకు వ్యాపారులు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరీ ముఖ్యంగా వాంకిడిలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లిన మద్యం దందాతో క్రితం సారి ఎక్సైజ్‌శాఖ అదనంగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2020లో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రాపూర్‌ జిల్లాలో మద్యనిషేధాన్ని ఎత్తివేసి మద్యం విక్రయాలు ప్రారంభించింది. దీంతో తెలంగాణ వైపు నుంచి మద్యం రవాణా కాకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఫలితంగా లాభాలపై ఆశతో దుకాణాలను చేజించుకున్న వ్యాపారులు లైసెన్సు ఫీజు కూడా చెల్లించ లేని పరిస్థితికి దిగజారిపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించ బోయే నూతన మద్యం విధానంలో వాంకిడి నుంచి ఒక దుకాణం రద్దు చేసి ఆసిఫాబాద్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఒక మద్యం దుకాణం నడవటం కష్టమేనని చెబుతున్నా పాత వ్యాపారులే మళ్లీ అక్కడే టెండర్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనించాల్సిన విషయం. 

గతంలోని స్లాబ్‌ విధానం..

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం అయిదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు లైసెన్సు ఫీజు, 5వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.60లక్షలు, లక్ష జనాభా నుంచి అయిదు లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల జనాభా కలిగి ప్రాంతాలకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10కోట్లుగా ఏడాది లైసెన్సు ఫీజును ఖరారు చేసి వసూలు చేసింది. ఈ లెక్కన 2019-2020, 2020-2021(రెండేళ్లకు)కు గాను కోటి రూపాయలు, రూ.1.10 కోట్లు, రూ.1.20 కోట్లు, రూ.1.30 కోట్లు, రూ.1.70 కోట్లు, రూ.2.20కోట్ల చొప్పున ఒక్కోదుకాణం లైసెన్సు ఫీజు చెల్లించింది.

Updated Date - 2021-10-24T04:31:11+05:30 IST