ఆనకట్టకు మహర్దశ!

ABN , First Publish Date - 2021-02-25T04:18:15+05:30 IST

శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరిలో నిర్మించిన ఆనకట్టకు మహర్దశ పట్టనుంది. ఆనకట్ట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది.

ఆనకట్టకు మహర్దశ!
ఉదయగిరి ఆనకట్ట

రూ.16 కోట్లతో ఆభివృద్ధి

పట్టణంలో తీరనున్న నీటి సమస్య

వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం 

ఉదయగిరి, ఫిబ్రవరి 24 : శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరిలో నిర్మించిన ఆనకట్టకు మహర్దశ పట్టనుంది. ఆనకట్ట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ ఆధికారులు కసరత్తు చేస్తున్నారు. పనులు పూర్తయితే 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆనకట్ట స్వరూపమే పూర్తిగా మారనుంది. దీంతో పట్టణ వాసులకు తాగునీటి సమస్య తీరనుంది. రాజుల కాలంలో నిర్మించిన రాతి కట్టడానికి 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి వచ్చిన సందర్భంగా రూ.2 కోట్లు మంజూరు చేయడంతో ట్యాంక్‌బండ్‌ నిర్మించారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సూచన మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్‌ శాఖ జిల్లా ఆధికారులు ట్యాంక్‌బండ్‌ను పరిశీలించి నివేదికలను పంపడంతో రూ.16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆనకట్ట అభివృద్ధిలో భాగంగా లోతట్టు ప్రాంతంలో ముళ్ల చెట్లను తొలగించడంతో పాటు కట్టపై వాకింగ్‌  ట్రాక్‌ నిర్మించనున్నారు. దీంతో సాయంత్రం వేళ వాకింగ్‌కు వెళ్లే వారికి ఎంతో మేలు చేకూరనుంది. అలాగే పట్టణంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయి. వీటి పరిధిలో 22 వేలకు పైబడి జనాభా ఉన్నారు. ఆనకట్టలో ఏర్పాటు చేసిన మూడు బోర్ల ద్వారా పట్టణంలోని కొళాయిలకు నీటిని సరఫరా చేస్తారు. ఆనకట్ట ఆభివృద్ధి చేస్తే నీటి సామర్ధ్యం పెరిగి నీరు నిల్వ పెరుగుతుంది. అలాగే ఆనకట్ట సమీపంలోని యాదవపాళెం, ఆవులవీధి, బాలాజీనగర్‌, కోళ్లవీధి, నాగులబావివీధి, స్టేట్‌పేట, బీసీకాలనీ, పూసలకాలనీ, ఏస్టీకాలనీ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోని బోర్లలో నీటిమట్టం పెరుగుతుంది.

Updated Date - 2021-02-25T04:18:15+05:30 IST