కర్ణాటకలోని మరాఠీ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతాం : ఉద్ధవ్ థాకరే

ABN , First Publish Date - 2021-01-17T22:46:30+05:30 IST

కర్ణాటకలో మరాఠీ మాట్లాడేవారు అధికంగా ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో

కర్ణాటకలోని మరాఠీ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతాం : ఉద్ధవ్ థాకరే

ముంబై : కర్ణాటకలో మరాఠీ మాట్లాడేవారు అధికంగా ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. ఈ లక్ష్యం కోసం అమరులైనవారికి ఇదే సరైన నివాళి అవుతుందన్నారు. 


ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెల్గాం, మరికొన్ని ప్రాంతాలు గతంలో బోంబే ప్రెసిడెన్సీలో ఉండేవని మహారాష్ట్ర వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ మాట్లాడేవారు అధికంగా ఉన్న ఈ ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని మహారాష్ట్ర రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో జనవరి 17న మహారాష్ట్ర ఏకీకరణ సమితి అమరుల దినంగా నిర్వహించింది. ఈ లక్ష్యం కోసం 1956 జనవరి 17న ప్రాణ త్యాగం చేసినవారికి నివాళులర్పించింది.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కర్ణాటక ఆక్రమణలోని మరాఠీ మాట్లాడే, సాంస్కృతిక ప్రాంతాలను మహారాష్ట్రలోకి తేవడం సరిహద్దు యుద్ధంలో అమరత్వాన్ని స్వీకరించినవారికి నిజమైన నివాళి అవుతుంది. మనం సమైక్యంగా ఉన్నాం, దీని పట్ల నిబద్ధతతో ఉన్నాం. ఈ హామీతో అమరులకు వందనం చేస్తున్నాం అని పేర్కొంది. 


కర్ణాటకలోని బెల్గాం, కార్వార్, నిప్పని ప్రాంతాలను తమకు ఇచ్చేయాలని మహారాష్ట్ర కోరుతోంది. ఈ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు అధికంగా ఉన్నారని వాదిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఈ సరిహద్దు వివాదం చాలా సంవత్సరాలుగా సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 


Updated Date - 2021-01-17T22:46:30+05:30 IST