ప్రధాన మంత్రి తక్షణం స్పందించాలి : ఉద్ధవ్

ABN , First Publish Date - 2021-05-05T23:40:59+05:30 IST

ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు

ప్రధాన మంత్రి తక్షణం స్పందించాలి : ఉద్ధవ్

ముంబై : ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 


ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఇచ్చిన తీర్పులో మరాఠాలను సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడినవారిగా ప్రకటించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్ల చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే పరిమితిని వదిలిపెడుతూ, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అసాధారణ పరిస్థితులేవీ లేవని పేర్కొంది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం లేదని తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది. 


ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని గత ఏడాది జూన్ 27న బోంబే హైకోర్టు సమర్థిస్తూ, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగాల్లో 13 శాతానికి కుదించాలని తెలిపింది. 


ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ విషయంలో తక్షణమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలన్నారు. చేతులు జోడించి, నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. 


Updated Date - 2021-05-05T23:40:59+05:30 IST