సంబరంగా.. తెలుగు సంవత్సరాది

ABN , First Publish Date - 2021-04-14T06:07:01+05:30 IST

తెలుగు వారి తొలి పండుగ.. ఉగాది వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. తెలుగువారి లోగిళ్లు ఉగాది సంబరాలతో నిండిపోయాయి.

సంబరంగా.. తెలుగు సంవత్సరాది
గుంటూరు గార్డెన్స్‌ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు

తెలుగువారి లోగిళ్లలో ఉగాది సందడి

కొంగొత్తగా ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం

ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు


గుంటూరు, ఏప్రిల్‌ 13: తెలుగు వారి తొలి పండుగ.. ఉగాది వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. తెలుగువారి లోగిళ్లు ఉగాది సంబరాలతో నిండిపోయాయి.  కొంగొత్త ఆశలతో ప్లవ నామ సంవత్సరానికి జిల్లాప్రజలు స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ప్లవ నామసంవత్సరాదిని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే వేప పచ్చడి సేవించి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం దేవాలయాలు, రచ్చబండల వద్ద ప్లవనామ సంవత్సరం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో హాజరైన వారు రానున్న కాలంలో రాశుల వారీగా తమ జాతకాల బలాలను వేదపండితుల ద్వారా తెలుసుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయా దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేకపూజలు నిర్వహించారు. కరోనా కష్టాల నుంచి దూరం చేయాలని కోరుతూ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. లోగిళ్లను ముగ్గులు, పూలు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించుకుని పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. షడ్రుచుల సంగమమైన ఉగాది పచ్చడి తయారు చేసుకున్నారు. జిల్లాలోని పలు ప్రధాన ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో  పాల్గొన్న భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. కరోనా మహమ్మారి నివారణ కోసం తెనాలి వైకుంఠపురంలోని శ్రీలక్ష్మిపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి శ్రీమృత్యుంజయ దేవత సహిత వెంకటేశ్వర మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. అమరావతిలోని అమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పంచాంగ శ్రవణం చేసి పంచాంగ పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ గుంటూరులోని బృందావన్‌గార్డెన్స్‌, గోరంట్ల, ఏటుకూరు, అమరావతి రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన ఆలయాల్లో పూజలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాంగం శ్రవణం చేసి ఈ ప్లవ నామ సంవత్సరంలో  రాజకీయ పార్టీల భవిష్యత్తుపై పురోహితులు పంచాంగం చదివి వినిపించారు. వ్యాపారులు కొత్త తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని నూతన దస్త్రాలను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరులోని అమరావతి రోడ్డు అన్నదాన సమాజం ఆడిటోరియంలో భారతీ సాంస్కృతిక, సంగీత కళావేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 150 మందికి ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించారు.   పంటలు సంపూర్ణంగా పండి రైతులు లాభాల బాట పట్టాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో లాంఫాంలోని   వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలు   నిర్వహించారు. ఇక గ్రామాల్లో రైతులు ఏరువాక సాగి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రైతులు పశువులకు పూజలు చేసి పొలాలను దున్నారు.


విజయకీలాద్రిలో విశేష కార్యక్రమాలు  

తాడేపల్లి టౌన్‌: ప్లవనామ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. సీతాసమేత రామలక్ష్మణ హనుమత్‌ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉగాది సందర్భంగా అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.  


 


Updated Date - 2021-04-14T06:07:01+05:30 IST