యుగ యుగాల పర్వం ఉగాది!

ABN , First Publish Date - 2021-04-09T05:30:00+05:30 IST

అఖండమైన సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. తెలుగువారికి...చాంద్రమానం అనుసరించేవారికి సంవత్సరంలో తొలి పండుగ. ఎన్నో యుగాల నాటి ఈ పండుగ కాల విభజనకు ఒక సూచిక. భవిష్యత్తులో చేయాల్సిన సత్కార్యాలకు సంకల్పం చేసుకోవడానికి కాలం

యుగ యుగాల పర్వం ఉగాది!

13న శ్రీ ప్లవ నామ సంవత్సరాది


అఖండమైన సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. తెలుగువారికి...చాంద్రమానం అనుసరించేవారికి సంవత్సరంలో తొలి పండుగ. ఎన్నో యుగాల నాటి ఈ పండుగ కాల విభజనకు ఒక సూచిక. భవిష్యత్తులో చేయాల్సిన సత్కార్యాలకు సంకల్పం చేసుకోవడానికి కాలం ఇచ్చిన ఒక అవకాశం.


కాలం అనంతం. దాని భ్రమణం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అందుకనే దాన్ని ‘కాలచక్రం’ అన్నారు. అలాంటి కాలానికి పరిమితులు లేకపోతే మానవుల మనుగడ కష్టమవుతుంది. పూర్వ ఋషులు తమ మేధస్సుతో కాలాన్ని ఖగోళం ఆధారంగా లెక్కించారు. సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయనీ, సూర్యుడి ప్రభావం మిగిలిన గ్రహాల మీద ఉంటుందనీ గుర్తించారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అనీ, చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ఒక మాసం అనీ, భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే ఒక సంవత్సరమనీ గణన చేశారు. ఈ గణనలో నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, పక్షాలూ, ఋతువులూ, ఆయనాలు  (ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడి గమనం ఆధారంగా ఆయనాలను పూర్వులు నిర్వచించారు. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే సమయాన్ని ఉత్తరాయనం అనీ, దక్షిణం వైపు ప్రయాణించడాన్ని దక్షిణాయనమనీ పేర్కొంటారు) ఎలా ఏర్పడ్డాయో ‘శ్రీ విష్ణుపురాణం’ ఈ శ్లోకాల్లో వివరించింది. 


కాష్ఠా పంచదశాఖ్యాతా నిమేషా మునిసత్తమః

కాష్ఠా త్రిశంత్కలా త్రింశక్తలా మౌహూర్తికోవిధిః

తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషంస్కృతమ్‌

అహోరాత్రాణితావన్తి మాసః పక్షద్వయాత్మకః

రెప్పపాటు కాలం ఒక నిమిషం. పదిహేను నిమిషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కల. ముప్ఫై కలలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక దినం (పగలు-రాత్రి). పదిహేను దినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక మాసం. ఆరు మాసాలు ఒక ఆయనం. రెండు ఆయనాలు ఒక సంవత్సరం. సంవత్సరానికి ఆరు ఋతువులుగా కాలమానాన్ని ఈ శ్లోక భావం వెల్లడిస్తోంది.. నాటి ఋషులు కాలమానాన్ని తొమ్మిది విధాలుగా విభజించారు. ప్రస్తుతం అయిదు కాలమానాలే ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో చాంద్రమాన, సూర్యమానాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్య, చంద్రుల సంచారాన్ని బట్టి ఈ మానాలు ఏర్పడ్డాయి. 


చైత్ర శుక్ల సమారంభే జగతాం జగదీశ్వరః

సర్వం చక్రేతదారాజన్‌! తతస్తస్మిన్‌ సదాదినే

బ్రహ్మ చైత్ర శుక్ల పాడ్యమి రోజున సృష్టి ముగించాడనీ, అదే యుగారంభమనీ చెబుతారు. అయితే, ఆ రోజునే సృష్టి ప్రారంభమయిందనీ అందుకే ఆ రోజు యుగాదిగా పరిగణన పొందిందనీ అంటారు. కాలక్రమంలో యుగాది అనే మాట ఉగాదిగా ప్రాచుర్యం పొందింది. ‘ఉగస్య ఆదిః ఉగాది’ అన్నారు పెద్దలు. ‘ఉగం’ అంటే నక్షత్ర సంచారం. అది మొదటి నక్షత్రమైన అశ్వినితో ప్రారంభమవుతుంది. శ్రీ విష్ణోత్తర పురాణాన్ని అనుసరించి... భూమధ్య రేఖ పైనుంచి చైత్ర శుక్ర పాడ్యమి అశ్వని నక్షత్రంలో సూర్యుడు ఉదయించాడు. అదే యుగారంభం అని వేద, పురాణాలు చెప్పాయి. చాంద్రమానాన్ని అనుసరించేవారు తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్రవాసులు, మరికొన్ని ప్రాంతాలవారు ఈ రోజును ఉగాదిగా, సంవత్సరాదిగా పండుగ జరుపుకొంటున్నారు. ఆ రోజునే వసంత ఋతువు ప్రారంభం కావడం సంవత్సరాదికి మరో విశేషం. 


కొత్త సంవత్సరం ఆరంభమైనప్పుడు... దాన్ని ఎలా పాటించాలో కూడా ఆనాడే ఋషులు నిర్ణయించారు. విధి విధానాలను స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకారం... ప్రాతఃకాలంలో తైలాభ్యంగన స్నానం చెయ్యాలి. ఇంట్లోని పెద్దలతో నువ్వుల నూనెను తలపై పెట్టించుకొని, వారి ఆశీస్సులు తీసుకున్న తరువాత స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందన్నది పెద్దల మాట. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, కులదైవాన్ని ఆరాధించాలి. పెద్దలకు నమస్కరించి, ఆశీస్సులు పొందాలి. దైవాన్ని ఆరాధించే సమయంలో నూతన పంచాంగాన్ని పూజించాలి. ఉగాది పచ్చడి నివేదించాలి. ఆ పచ్చడి ఎలా చేయాలో కూడా శాస్త్రమే చెప్పింది.


‘కించ యద్వర్షాదౌ నింబ కుసుమం - శర్కరామ్ల ఘృతైర్యుతం

భక్షతం పూర్వ యేమేస్యాత్‌ - తద్వర్షం సౌఖ్యదాయకం’ అని.

ప్రధానమైన వేప పువ్వుతో పాటు బెల్లం, కొత్త చింతపండు, ఆవు నెయ్యి, మామిడి కాయముక్కలు కలిపి గుజ్జుగా తయారు చేయాలి. నివేదన పూర్తికాగానే ప్రసాదంగా దాన్ని పరగడుపునే భుజించాలి. ఆయుర్వేద పరంగా ఇది గొప్ప ఔషధం. దీనివల్ల ఏడాది కాలం వాత, పిత్త, కఫ దోషాలు దరి చేరవని ఆయుర్వేదం చెబుతోంది. ఇంట్లో కానీ, దేవాలయాలలో కానీ పంచాగ శ్రవణం చేయాలి. దీనివల్ల... గ్రహాల సంచారం ద్వారా వ్యక్తులకు కలిగే సుఖాలు, సంపదలతో పాటు ఆ సంవత్సర కాలంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.


రానున్న సంవత్సరం పేరు ‘ప్లవ’. అంటే ‘నౌక’. వెళ్ళబోతున్న సంవత్సరం పేరు ‘శార్వరి’. అంతా చీకటిమయం. ఎన్నో కష్టాల కాలం. ఆ కష్టాల నుంచి గట్టెక్కించే నావ ‘ప్లవ’లోకి ప్రవేశం... అంతా శుభంగా, సౌఖ్యంగా ఉంటుందన్న నమ్మకంతో నవ ఉగాదికి స్వాగతం చెబుదాం.

ఎ. సీతారామారావు 89787 99864

Updated Date - 2021-04-09T05:30:00+05:30 IST