ఖతర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

ABN , First Publish Date - 2022-04-04T21:09:21+05:30 IST

పరాయి గడ్డపై ఉన్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అమిత ప్రాధాన్యమిచ్చే ప్రవాసీయులు..ఉగాది నూతన తెలుగు సంవత్సర వేడుకులను గల్ఫ్ దేశాలలో వైభవంగా జరుపుకున్నారు.

ఖతర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పరాయి గడ్డపై ఉన్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అమిత ప్రాధాన్యమిచ్చే ప్రవాసీయులు..ఉగాది నూతన తెలుగు సంవత్సర వేడుకులను గల్ఫ్ దేశాలలో వైభవంగా జరుపుకున్నారు. రెండేళ్ల పాటు సాగిన కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను  ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు అంగరంగా నిర్వహించి అందర్ని అబ్బురపరిచారు. ప్రవాసాంధ్ర సంఘం ఆంధ్ర కళా వేదిక - ఖతర్  ఉగాది సందర్భంగా  "పండగ చేస్కో" కార్యక్రమాన్ని ఐడీఎల్ ఇండియన్ స్కూల్‌లో  ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో భారతీయ రాయబార కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల దౌత్యవేత్త పద్మ కర్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు సార్లు నంది అవార్డు గ్రహీత, సినీ నేపథ్య గాయని శ్రీమతి ఉష తన పాటలతో, మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించారు. 


ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతర్‌లోని తెలుగు వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఎన్నో అవాంతరాలను అధిగమించి కేవలం వారం రోజుల వ్యవధిలో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమానికి సుమారు 700 కి పైగా హాజరయ్యారని తెలిపారు. ఈ వేడుకల్లో  భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.  ఈ కార్యక్రమానికి శిరీషా రామ్, శ్రీ సుధ వ్యాఖ్యాతలుగా విక్రమ్ సుఖవాసి సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించగా, రవీంద్ర వందన సమర్పణ చేసారు. 



Updated Date - 2022-04-04T21:09:21+05:30 IST