అంతటా ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-14T06:25:28+05:30 IST

జిల్లావ్యాప్తంగా ప్లవనామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

అంతటా ఉగాది వేడుకలు
మోత్కూరులో గ్రామదేవతకు బోనాలు సమర్పిస్తున్న మహిళలు

మోత్కూరులో గ్రామదేవతలకు బోనాలు

యాదాద్రిక్షేత్రంలో ఆస్థానపరంగా పంచాంగ శ్రవణం 

జిల్లావ్యాప్తంగా ప్లవనామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అరటి ఆకులు, మామిడి తోరణాలతో ఇళ్లన్నీ అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. ఉదయంనుంచే ఆలయాలకు చేరుకొని పంచాంగ శ్రవణాల్లో పాల్గొని, తమ రాశిఫలాల వివరాలు తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో యాదాద్రి దివ్యక్షేత్రంలో ఆస్థానపరంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకరీతిలో జరిగే ఉగాది సంబురాలు ఈసారి మోత్కూరులో ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలకు బోనాలు సమర్పించి, ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. 


మోత్కూరు: మోత్కూరు మునిసిపల్‌ కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడా నిర్వహించనిరీతిలో ప్రత్యేక తరహాలో మంగళవారం ఉగాది వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో సోమవారం సాయంత్రం బోనం వండి, మంగళవారం చలిబోనాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. రైతులు తమ ఎడ్లబండ్లు, ఇతర వాహనదారులు తమ వాహనాలను అందంగా అలంకరించి రంగులుచల్లారు. కొవిడ్‌ కారణంగా బోనాలుగాని, ఎడ్లబండ్లు, వాహనాలు గాని ప్రదర్శనగా వెళ్లవద్దని అధికారులు దండోరా వేయించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణకు బోనాలు, బండ్లు, వాహనాలు చేరుకోకుండా పాఠశాల గేటుకు తాళంవేశారు. మహిళలు ప్రదర్శనగా వెళ్లకుండా పక్కపక్క ఇళ్లవారు ఐదారుగురు కలిసి బోనాలు ఎత్తుకుని పట్టణానికి తూర్పున, పడమర దిక్కున ఉన్న ముత్యాలమ్మ ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించారు. ఎడ్లబండ్లు ఉన్న రైతులు, ఇతర వాహనదారులు కూడా ఎవరికివారుగా వెళ్లి పట్టణానికి పడమర దిక్కున ఉన్న ముత్యాలమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తిప్పుకొని వెళ్లిపోయారు. సాయంత్రం రామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పూజారులు పారునంది వెంకటరమణశర్మ, లక్ష్మణమూర్తి, రాజలింగం, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, ఆలయాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గుండగోని రామచంద్రు, కౌన్సిలర్‌ పురుగుల వెంకన్న, కల్వల ప్రకాశ్‌రాయుడు, పురుగుల మల్లయ్య, ఆనందం, సీతయ్య, ముత్యాలు, రాజు, యాకయ్య పాల్గొన్నారు. 


యాదాద్రిక్షేత్రంలో శాస్త్రోక్తంగా ఉగాదిపర్వాలు

యాదాద్రి టౌన్‌: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మంగళవారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు పరిమిత సంఖ్యలో అర్చక, అధికార బృందం ఆధ్వర్యంలో నిరాడంబరంగా కొనసాగాయి. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా విశేష వేడుకలను ఆస్థానపరంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన పూజారులు బాలాయంలో కవచమూర్తులను సువర్ణపుష్పాలతో అర్చించారు. కల్యాణ మండపంలో ప్రత్యేకవేదికపై అధిష్ఠింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆస్థాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణశర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాజుగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా, సేనాధిపతిగా కుజుడు, మంత్రిగా బుధుడు, ధాన్యాధిపతి గురువు కాగా నీరసాధిపతిగా శుక్రుడు, పశు పాలకుడిగా, స్థాన రక్షకుడిగా యముడు వ్యవహరిస్తాడని చెప్పారు. 2 తూముల వర్షం, 3 తూముల గాలి వీస్తుందని, 7తూములకు పైగా పాడి పంటలు పండుతాయని వివరించారు. విశ్వశాంతి, లోక కల్యాణంకోసం యాదాద్రి కొండగుహలో వెలసిన లక్ష్మీ, నారసింహుల ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉన్నాయన్నారు. ప్లవ నామ సంవత్సరంలో స్వామివారు నారసింహుడి తులరాశి ఆదాయం 2, వ్యయం 8, అమ్మవారు సింహ రాశి ఆదాయం 2, వ్యయం 14గా ఉన్నాయని వివరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీప్లవనామ సంవత్సర నూతన పంచాంగాన్ని అర్చకులు, ఆలయ సిబ్బంది నడుమ ఆవిష్కరించారు. యాదాద్రీశుడి సన్నిధిలో కొలువైన సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలకు మంగళవారం ఉదయం చరమూర్తులు కొలువైన ఉపాలయంలో ఆస్థానపరంగా శ్రీకారంచుట్టారు. భక్తులనుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3,67,896 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.   

Updated Date - 2021-04-14T06:25:28+05:30 IST