ఉగాది సంబరం

ABN , First Publish Date - 2021-04-14T05:02:32+05:30 IST

ప్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం నెల్లూరు నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళతోరణాలతో ఇళ్లను అలంకరించి పూజలు చేశారు. ఆలయాల్లో ఉత్సవాలు, విశేష అభిషేకాలు, పూజలు, అలంకారాలు, పంచాంగ శ్రవణం జరిగాయి.

ఉగాది సంబరం
విశేష అలంకరణలో ఇరుకళల పరమేశ్వరి

ఇంటింట ప్లవ సంవత్సరాది వేడుకలు

ఆలయాల్లో ఉత్సవాలు

లక్ష్మీనరసింహస్వామికి పారువేట కల్యాణం

ఇరుకళల పరమేశ్వరికి నగరోత్సవం

వీరభద్ర స్వామికి నందిసేవ

అర్చకులకు ఉగాది పురస్కారాలు


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 13 : ప్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం నెల్లూరు నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళతోరణాలతో ఇళ్లను అలంకరించి పూజలు చేశారు. ఆలయాల్లో ఉత్సవాలు, విశేష అభిషేకాలు, పూజలు, అలంకారాలు, పంచాంగ శ్రవణం జరిగాయి. 


లక్ష్మీ నృసింహుడికి పారువేట

వేదగిరి లక్ష్మీనరసింహాస్వామికి నగరంలో పారువేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో స్వామివారు ఊరేగింపుగా నరసింహకొండ నుంచి నగరంలోని తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి రంగనాథుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడి నుంచి నవాబుపేట ఉడయవర్లు దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ తిరుమంజనం సేవ అనంతరం కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాత్రి నగరోత్సవం అనంతరం స్వామి వేదగిరి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహస్వామి ఆలయ చైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి, ఈవో పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉడయవర్లు దేవస్థానం చైర్మన్‌ రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు. 


ఇరగాళమ్మకు నగరోత్సవం... 

నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి మంగళవారం రాత్రి నగరోత్స వం వైభవంగా జరిగింది. ఉదయం అభిషేకాలు, విశేషపూజలు జరిగాయి. పుష్ప, విద్యుదీ పాలంకరణ, మంగళవాయిద్యాలు, బాణసంచా వేడుకలతో నగరోత్సవం సాగింది.  రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి గిరిధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ వట్టూరు సుధాకర్‌, ధర్మకర్తలు, మాజీ చైర్మన్‌ మెట్టు సురేష్‌బాబు, గిరీష్‌ కుమార్‌జైన్‌, అయితా సృజన్‌, విశ్వనాథ్‌, ఈవో పీవీకే ప్రసాద్‌ పర్యవేక్షించారు. తల్పగిరి రంగనాథ స్వామి తరపున ఇరగాళమ్మకు ఉగాది సారెను అర్చకస్వాములు అందచేశారు. 

Updated Date - 2021-04-14T05:02:32+05:30 IST